నిర్భయకు న్యాయం…రేపు ఉదయం 5:30గంటలకు దోషులకు ఉరి

నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్త ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం(మార్చి-19,2020)సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2012లో నిర్భయ‌పై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్ బాలుడినంటూ పవన్ గుప్త చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌ అయినందున ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ పవన్ గుప్తా తన పిటిషన్‌లో కోరాడు.

కాగా నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనంటూ నిన్న మరో దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న పిటిషన్‌ను సైతం పటియాలా కోర్టు ఇవాళ కొట్టివేసిన విషయం తెలిసిందే. తమకు ఇంకా న్యాయపరమైన రెమెడీస్ ఉన్నాయని,తమ ఉరిని ఆపాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను పటియాలా కోర్టు కొట్టేసింది ఇప్పటివరకు ఎటువంటి లీగల్ రెమెడీస్ పెండింగ్ లో లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ కోర్టుకి తెలిపారు.

నిర్ణయించిన ప్రకారం శనివారం ఉదయం 5:30గంటలకు నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయబడతారని ఇవాళ పటియాలా కోర్టు సృష్టం చేసింది.  కాగా, ఈ తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ….కోర్టు ఇప్పటికే వాళ్లకు చాలా అవకాశాలు ఇచ్చింది. సరిగ్గా ఉరిశిక్ష అమలుకు ముందు వాళ్లు ఏదో ఒక వాదన తీసుకొచ్చి వాయిదా వేయించుకున్నారు. వాళ్ల యుక్తుల గురించి ఇప్పుడు కోర్టులకు కూడా అవగాహన వచ్చింది. రేపు నిర్భయకు న్యాయం జరుగుతుందని ఆశాదేవి తెలిపారు. మార్చి 20 ఉద‌యం 5.30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీయాల‌ని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే.

బుధవారం తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో ‘డమ్మీ ట్రయల్’ జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు.  జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో  దీన్ని నిర్వహించామని, ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు. డమ్మీ ట్రయల్ అరగంట పాటు కొనసాగిందని తెలిపారు.