దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సిద్ధం అయిపోయారు అధికారులు. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.. ఫిబ్రవరి ఒకటవ తేదీ ఉదయం 6గంటలకు నిర్భయ కేసులో దోషులైన నలుగురు మృగాళ్లను చనిపోయేవరకు ఉరి తీయబోతున్నారు జైలు అధికారులు.
ఇప్పటికే నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లను ప్రత్యేకంగా జైలు గదుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. కట్టుదిట్టమైన జైలు వార్డర్ల భద్రత మధ్య దోషులను నిర్భిందించి ఉంచారు అధికారులు. అందుకోసం వారికి రూ. 50వేల వరకు ఖర్చు అవుతుంది. ఇదిలా ఉంటే తిహార్ జైలులో నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మపై స్లో పాయిజన్ ఇచ్చారని అతని న్యాయవాది పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన క్లయింట్ వినయ్ శర్మకు స్లో పాయిజన్ ఇవ్వడంతో అతను ఆసుపత్రిలో చేరాడని, అతని వైద్య నివేదికలను జైలు అధికారులు ఇవ్వడం లేదని అందులో పేర్కొన్నారు. వినయ్ శర్మ చికిత్స సంబంధించిన రుజువులు తిహార్ జైలులోని 2,3 గదుల్లో ఉన్నాయని, అతన్ని ప్రస్థుతం 4వ నంబరు జైలుకు మార్చారని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
వినయ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్థుతం బాగా లేదని, అతను భోజనం చేయడం లేదని, రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనలో ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని లాయర్ కోరారు. అయితే నిర్భయ దోషి న్యాయవాది వేసిన పిటిషన్‌ను వెంటనే కోర్టు కొట్టివేసింది.