నితీశ్ కుమార్ రూటే సపరేటు.. సన్నిహితుడిపై వేటు!

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి సంచలనానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితుడైన లాలాన్ సింగ్‌పై వేటు వేయాలని ఆయన భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.

Nitish Kumar likely to replace Lalan Singh as JDU chief says Sources

Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. జనతాదళ్ (యునైటెడ్) చీఫ్‌గా ఉన్న రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలాన్ సింగ్‌ను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. లాలన్ పనితీరుపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుర్రుగా ఉన్నారని, ఆయనను పదవి నుంచి తప్పించనున్నారని జేడీ(యూ) వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి. జేడీ(యూ) పార్టీ అధ్యక్షుడిగా నితీశ్ కుమారే బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.

లాలాన్ పనితీరుపై నితీశ్ గుర్రు
పార్టీ చీఫ్‌గా నితీశ్ కుమారే ఉండాలని ఆయనకు సన్నిహితులు సూచించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే లాలాన్ సింగ్ ప్లేస్‌లో కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తే మరింత గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాలాన్ పనితీరు నచ్చకపోవడంతోనే ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని నితీశ్ నిర్ణయానికి వచ్చినట్టు జేడీ(యూ) వర్గాల సమాచారం. ముఖ్యంగా RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లతో లాలాన్ సింగ్ రాసుకుపూసుకుని తిరగడం నితీశ్‌కు అస్సలు నచ్చలేదట.

నితీశ్‌కు రాహుల్  గాంధీ ఫోన్
ఇండియా బ్లాక్ కూటమితో తన సంబంధాలు దెబ్బతినడానికి లాలాన్ సింగ్ కారణమయ్యరనే కోపం కూడా ఉందట. ఇండియా కూటమి కన్వీనర్ గా తనను ఎంపిక చేయకపోవడంతో నితీశ్‌ నిరాశపడ్డారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశానికి ఆయన ముఖం చాటేశారని గుసగుసలు విన్పిస్తున్నాయి. మరోవైపు సీట్ల షేరింగ్ పై జనవరిలోపు క్లారిటీ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం నితీశ్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: శరద్ పవార్‌ను కలిసిన రాహుల్ గాంధీ.. ఏయే అంశాలు చర్చకు వచ్చాయంటే?

లాలాన్ సింగ్ జంప్!
కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ముంగేర్ నుంచి పోటీ చేసేందుకు లాలాన్ సింగ్ ఆసక్తిగా ఉన్నారని, ఆయన ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) టికెట్‌పై పోటీ చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో నితీశ్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. జేడీ(యూ) అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే లాలాన్ సింగ్ పార్టీని వదిలిపెట్టడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గతంలో నితీశ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్వాసనకు గురైన జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్, ఆర్‌సిపి సింగ్, ఉపేంద్ర కుష్వాహ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లిస్టులో లాలాన్ చేరే అవకాశం ఉందని అంచనా. లాలాన్ సింగ్ విషయంలో నితీశ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: లోక్‭సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ.. రామమందిర శంకుస్థాపన అవ్వగానే అభ్యర్థుల ప్రకటన!

ఎవరీ లాలాన్ సింగ్?
జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా లాలాన్ సింగ్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. బిహార్ లోని ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో జేడీ(యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ్ తో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జితన్ రామ్ మాంఝీ క్యాబినెట్ లో మంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది. తర్వాత నితీశ్ కుమార్ మంత్రివర్గంలోనూ కొనసాగారు. 2021, జూలై 31న జేడీ(యూ) చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. లాలాన్ సింగ్ సతీమణి పేరు రేణు దేవి. వీరికి ఒక కుమార్తె ఉంది.