నవంబర్-10 తర్వాత తేజస్వీ ముందు నితీష్ మోకరిల్లడం ఖాయం

Nitish Kumar will bow down before Tejashwi after November 10 బీహార్ సీఎంపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. నితీష్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇకపై సీఎం కాలేడంటూ కొన్ని రోజులుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన చిరాగ్…తాజాగా నవంబర్-10న బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆర్జేడీ నేత ముందు నితీష్ మోకరిల్లడం ఖాయమన్నారు. నితీష్ కుమార్ కి తానే ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న అత్యాశ ఉందన్నారు.



గత ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన నితీష్..ఇప్పుడు అదే ప్రధాని మోడీ ముందు మోకరిల్లాడని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అధికారం అంటే నితీష్ కి ఎంత ప్రేమ మరియు అత్యాశ ఉందనడానికి ఇదే సాక్ష్యమన్నారు. నవంబర్-10 తర్వాత ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందు నితీష్ మోకరిల్లడం పక్కా అని చిరాగ్ తెలిపారు.



అంతేకాకుండా, ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్ పై కొందరు ఉల్లిపాయలు విషయాన్ని ప్రస్తావించిన చిరాగ్…తనపై ఉల్లిపాయలు విసిరిన ఆందోళనకారులను పిలిచి వారి సమస్యలు తెలుసుకోవడానికి బదులుగా..పీకో పీక్ ఔర్ పీకో అంటూ వారిని నితీష్ ఉసిగొల్పుతున్నాడని చిరాగ్ విమర్శించారు. నితీష్ స్పందించిన విధానాన్ని తాను అభినందించబోనని చిరాగ్ తెలిపారు.



కాగా, మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 3దశల్లో ఎన్నికలు జరుగుతుండగా…ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. ఇక, మూడో దశలో నవంబర్-7న మిగిలిన 78స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.



ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీచేస్తుండగా..ఆర్‌జేడీ-కాంగ్రెస్-మూడు లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. ఇక,కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(LJP)స్వతంత్రంగా పోటీ చేస్తోంది.