ఒక్కసారిగా దొంగలుగా మారిన ప్రయాణికులు.. ఫస్ట్ క్లాస్‌ ఏసీ కోచ్‌లో వీటిని మాయం చేసి.. వీడియో వైరల్‌

ప్రయాణికుడు స్పందిస్తూ.. అది తప్పుగా జరిగిందని, తన తల్లి తెలియకుండా ప్యాక్‌ చేసి ఉండి ఉండొచ్చని ఈ నిందను తన తల్లిపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, రైల్వే సిబ్బంది నమ్మలేదు.

ఒక్కసారిగా దొంగలుగా మారిన ప్రయాణికులు.. ఫస్ట్ క్లాస్‌ ఏసీ కోచ్‌లో వీటిని మాయం చేసి.. వీడియో వైరల్‌

Video Viral

Updated On : September 21, 2025 / 3:53 PM IST

Video Viral: రైలులోకి దొంగలు వస్తే ప్రయాణికులు ఎంతో ఆందోళన చెందుతారు. అటువంటిది ప్రయాణికులే దొంగలుగా మారి ఫస్ట్ క్లాస్‌ ఏసీ కోచ్‌లో రైల్వేకు చెందిన బెడ్‌షీట్లు, టవల్స్‌ను చోరీ చేశారు. వాటిని తమ సామాగ్రిలో పెట్టి అక్కడి నుంచి జంప్ అయిపోయే ప్రయత్నం చేశారు.

వారు వాటిని చోరీ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను ఓ కోచ్‌ అటెండెంట్ చిత్రీకరించారు. దేబాబ్రత సాహూ ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ ప్రయాణికులు ఢిల్లీ-ఒడిశా పురుషోత్తమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన సాహూ.. “పురుషోత్తమ ఎక్స్‌ప్రెస్‌ ఫస్ట్ ఏసీలో ప్రయాణించడం గర్వకారణంగా భావిస్తాం. అయినా కూడా కొందరు అక్కడ ఇచ్చే బెడ్‌షీట్లను సిగ్గులేకుండా ఇంటికి తీసుకెళ్లడానికి చోరీ చేస్తున్నారు” అని ఆయన చేర్చారు.

ఈ వీడియోలో అటెండెంట్ ప్రయాణికుల బ్యాగుల్లో నుంచి వస్తువులను చూపిస్తూ.. “సర్‌, చూడండి, బెడ్‌షీట్లు, బ్లాంకెట్స్ అన్ని బ్యాగుల నుంచి బయటకు తీస్తున్నాం. టవల్స్‌, బెడ్‌షీట్లు కలిపి నాలుగు సెట్స్‌. ఇవి తిరిగి ఇవ్వండి లేదా రూ.780 చెల్లించండి” అని ఆయన ఒడియా భాషలో అన్నారు.

Also Read: వీలునామా/మరణ వాంగ్మూలం పేరిట మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. సంచలన కామెంట్స్‌

ప్రయాణికుడు స్పందిస్తూ.. అది తప్పుగా జరిగిందని, తన తల్లి తెలియకుండా ప్యాక్‌ చేసి ఉండి ఉండొచ్చని ఈ నిందను తన తల్లిపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, రైల్వే సిబ్బంది నమ్మలేదు.

“సర్‌, మీరు ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణిస్తున్నప్పుడు ఎందుకు దొంగతనం చేస్తున్నారు? అందులోనూ మీరు పవిత్రతతో తీర్థయాత్రకు వెళ్తున్నట్టు చెప్పారు” అని అటెండెంట్ కుటుంబాన్ని చూపిస్తూ అన్నాడు.

తరువాత టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) వచ్చి, ఈ విషయం రైల్వేస్‌ యాక్ట్ కింద పెద్దదవుతుందని చెప్పారు. “పీఎన్‌ఆర్‌ నంబర్‌ ఏమిటి? మీరు చెల్లిస్తే రసీదు ఇస్తాను. లేకపోతే పోలీసులు వస్తారు. ఆ పీఎన్‌ఆర్‌ మీద ఎఫ్ఐఆర్‌ నమోదు చేస్తాను” అని హెచ్చరించాడు.

ఆ కుటుంబం మూడు బెడ్‌షీట్లు మాత్రమే దొరికాయని, అది నిజంగా తప్పిదమని వాదించింది. కానీ అటెండెంట్ వారి తీరుపై మండిపడ్డాడు. “మూడు బెడ్‌షీట్లు మీ బ్యాగులో ఉన్నప్పుడు అది తప్పిదం ఎలా అవుతుంది?” అని అన్నారు. ప్రయాణికుల తీరుపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.