ఈ ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దవుతుందా!

Amarnath Yatra దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గతవారం అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే గతేడాదిలాగే కూడా ఈ ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు దీనిపై స్పందించింది. జూన్‌ 28 నుంచి 56 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయడంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ ఏడాది కోవిడ్-19 మహమ్మారి తీవ్రతను బట్టి బోర్డు మీటింగ్‌లో అమర్‌నాథ్ యాత్ర నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.

పరిస్థితులు మెరుగైతే కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ, యాత్రను నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని దేవస్థానం బోర్డు తెలిపింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిన నేపథ్యంలోనే భక్తుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా మాత్రమే నిలిపేసినట్లు తెలిపింది. కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.

కాగా,అసాధారణ పరిస్థితులతో గత రెండేళ్లుగా గత రెండేళ్లుగా అమర్‌నాథ్ యాత్ర జరగలేదు. 2019లో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ ఏడాది అమర్‌నాథ్ యాత్రను అర్థాంతరంగా రద్దు చేశారు. 2020లో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో యాత్రను రద్దుచేసిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు