దేశంలో మరోమారు లాక్ డౌన్ ఉండబోదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. అన్ లాక్-2 ఎలా అమలు చేయాలన్న విషయంపై చర్చించాలన్నారు. కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతుందన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రధాని మోడీని కోరారు.
దీనిపై స్పందిస్తూ దేశంలో లాక్ డౌన్ ల దశ ముగిసి అన్ లాక్ ల దశ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లాన్ లాక్-1 నడుస్తోందని చెప్పారు. అన్ లాక్ 2 ఎలా అమలు చేయాలన్న విషయంపై చర్చించాలని ముఖ్యమంత్రులతో ప్రధాని అన్నారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నందున మరోమారు లాక్ డౌన్ విధిస్తారన్న ఊహాగానాల వస్తున్న తరుణంలో ప్రధాని మోడీ స్పష్టత ఇచ్చారు.
లాక్ డౌన్ సమయంలో ప్రజలు పాటించిన క్రమశిక్షణతోనే దేశంలో కరోనా ఎక్కువగా వ్యాపించకుండా అడ్డుకోగలిగామని ప్రధాని మోడీ తెలిపారు. అలాగే కరోనా సోకిన కారణంగా సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవాలన్నారు. రాష్ట్రాలు కరోనా టెస్టుల సంఖ్యను మరింత పెంచాలని, వైద్య సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ప్రధాని మోడీ ఈ సమావేశంలో చర్చించారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతానికి కృషి చేయాలని..అప్పుడే కరోనా వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి వైద్యం అందించగలమని ప్రధాని అన్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పారు. అలాగే టెస్టుల సంఖ్య కూడా పెంచాలన్నారు. అప్పుడే కరోనా సోకిన వారిని త్వరగా గుర్తించి ఐసోలేషన్ కు తరలించి వైద్యం అందించగలమని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 900 కరోనా టెస్టు సెంటర్లు ఉన్నాయని తెలిపారు. లక్షల సంఖ్యలో కరోనా ప్రత్యేక బెడ్స్, ఆక్సిజన్ సదుపాయంతో వేలల్లో క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయిని వెల్లడించారు.
కరోనా వైరస్ సోకుతుందనే భయాలను తొలగించేందుకు ప్రజలకు సహాయం చేయాలన్నారు. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతూనే ఉందని ప్రకటించారు. కరోనా సోకిన వారు ఆందోళన చెందకూడదని చెప్పారు. ప్రజలు ఒకే చోట ఎక్కువ గుమికూడటం, భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడం, రోజులో వేలాది మంది బయట తిరగటం వంటి కారణాలతో కొన్ని నగరాల్లో కరోనా కట్టడి మరింత సంక్షిష్టంగా మారిందని ప్రధాని అన్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మోడీ సూచించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో రికవరీ రేటు 52.79 శాతంగా ఉంది. గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 10, 794 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 3.5 లక్షలకు చేరింది. ఆరో రోజు 10 వేల కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,903కి చేరింది. ఢిల్లీ, ముంబాయిలో కరోనా వైరసై కేసుల తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపింది.