శతాబ్దాల సంప్రదాయాన్ని పక్కనపెట్టి 2018లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టవచ్చు. ఈ మేరకు సుప్రీం కోర్టు అప్పట్లో సంచలన తీర్పు వెల్లడించింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ప్రతి మహిళ అర్హురాలే అని చెప్పింది కోర్టు. అయితే దానిపై రివ్యూ పిటీషన్‌లను వేయగా.. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అంటే, సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థం.
ఈ క్రమంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ సమాన హక్కుల పేరిట సుప్రీంకోర్టు ఇంతకుముందు తీర్పు ఇవ్వగా.. శబరిమలకు వెళ్లాలని అనుకునే మహిళలకు రక్షణ విషయం మాత్రం ఇప్పుడు ఇబ్బందిగా మారింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ క్రమంలోనే కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
శబరిమల అయ్యప్పను దర్శించుకునే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రక్షణ కల్పించే ఆలోచన లేదని, ప్రభుత్వం శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తుందని అన్నారు. అందువల్ల దేవాలయం వద్ద యథాతథ స్థితిని కొనసాగించడమే సరైందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కోర్టు తీర్పు విషయంలో ఉన్న సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే మహిళల ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
అయితే, ఈ నెల 16న అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుంటానన్న మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ ప్రకటించగా మంత్రి సురేంద్రన్.. ‘శబరిమల ఆలయానికి ఎవరైనా వెళ్లాల్సిన అవసరం ఉంటే కోర్టును ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోవచ్చు’ అని అన్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీస్తుంది.