Sadhguru Jaggi Vasudev : దండయాత్రల్లో ధ్వంసం చేయబడిన దేవాలయాల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదు : సద్గురు జగ్గీ వాసుదేవ్

Sadhguru Jaggi Vasudev : రత్నగర్భగా చరిత్రలకు పుట్టినిల్లుగా ఉండే భారతదేశం ఎన్నో దండయాత్రలకు గురి అయ్యింది. ఎన్నో చారిత్రాత్మక కోటలు, దేవాలయాలు, కట్టడాలు పలువురు భారత్ పై చేసిన దండయాత్రల్లో ధ్వంసమయ్యాయి. అప్పుడు ధ్వంసం చేయబడిన దేవాలయాలపైన మసీదులు కట్టారని వాదనలు తాజాగా వివాదంగా మారాయి. మందిరాలే మసీదులుగా మార్చేశారని వాటిని తిరిగి దేవాలయాలుగా తీర్చి దిద్ది పూజలు జరగాలనే వాదనలు..డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ ఇటువంటి వివాదాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసువేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also read :

ఏనాడో దండయాత్రల సమయంలో ధ్వంసమైన వేలాది ఆలయాల గురించి ఇప్పుడు మాట్లాడడం సరైనది కాదని..చరిత్రను తిరగరాయలేమని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో వాటిని మనం కాపాడుకోలేదు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం వివేకం అనిపించుకోదు’’ అని అన్నారు. దండయాత్రల సమయంలో వేల సంఖ్యలో దేవాలయాలు ధ్వంసమయ్యాయని.. అప్పుడు వాటిని కాపాడుకోలేకపోయామని.. ఇప్పుడు చరిత్రను తిరగరాయలేనందున వాటి గురించి మాట్లాడటం సమంజసం కాదు అని సూచించారు.

రెండు కమ్యూనిటీలు (హిందు, ముస్లింలు మందిరాలు..మసీదులు గురించి) కలసి కూర్చుని కీలకమైన రెండు మూడు ప్రదేశాల గురించి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని వాసుదేవ్ సూచించారు. ఒకే సమయంలో ఒక ఒకదాని గురించే మాట్లాడుకోవడం వల్ల వివాదం పరిష్కారం కాదని, శత్రుత్వ భావన తొలగిపోదన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అదే మార్గమని సూచించారు.

భారత్ ఇప్పుడు కీలక మలుపు వద్ద ఉందన్నారు. ఈ సమయంలో సరైన విధంగా అడుగులు వేస్తే భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తుందని జగ్గీ వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. ప్రతి విషయాన్ని పెద్ద వివాదం చేసుకుని ఈ అవకాశాన్ని వృథా చేసుకోరాదు అని సూచించారు. మందిర్-మసీదు అంశాన్ని మీడియా సంస్థలు వివాదాస్పదం చేయవద్దని.. బదులుగా పరిష్కారం వైపు తీసుకెళ్లాలని సూచించారు. పరిష్కరించుకోలేని అంశం అంటూ ఏదీ లేదన్నారు.హిందీ, దక్షిణాది రాష్ట్రాల భాషల మధ్య వివాదంపై వాసుదేవ్ స్పందిస్తూ.. ‘‘అన్ని భాషలకు భారత్ లో సమాన స్థానం ఉంది. హిందీ కంటే దక్షిణాది భాషలకు సాహిత్యం ఎక్కువ. భారత్ విభిన్నమైన దేశం’’ అని చెప్పారు.

మందిరాలు-మసీదుల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.ఈ వివాదం కోర్టు మెట్లెక్కడం, మసీదులో శివలింగం కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు ఇది హిందూ దేవాలయమన్న వాదనలకు బలం చేకూరుతోంది.

ట్రెండింగ్ వార్తలు