దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది.
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మంది క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయని హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దేశరాజధాని ఢిల్లీలో 9లక్షల మందికి పాజిటివ్ పరీక్షలు నిర్వహించారు. అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య రాబోయే రోజుల్లో ప్రమాదాన్ని సూచిస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఢిల్లీ, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సానుకూల ఫలితాలు చూపిస్తుండగా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు పెరిగి ఆందోళనకరంగా ఉంది. పాజిటివ్ కేసుల విషయంలో 2.60 లక్షలతో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉండగా….1.42 లక్షల కేసులతో తమిళనాడు రెండో స్ధానంలో ఉంది.
ప్రజలను క్వారంటైన్ లో ఉంచే విషయానికి వస్తే ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర కన్నా ముందుంది. ఉత్తర ప్రదేశ్ లో 11 లక్షల మంది క్వారంటైన్ లో ఉండగా… మహారాష్ట్రలో 7.27 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నారు. తమిళనాడులో 4.10 లక్షలు, గుజరాత్ లో 3.52 లక్షల మంది క్వారంటైన్ లో ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు మిలియన్ జనాభాలో దాదాపు 3,000 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెలాఖరుకు ఇది 4వేలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజు వారి చేసే పరీక్షల సామర్ద్యాన్ని పెంచుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 42 ప్రభుత్వ టెస్టింగ్ ల్యాబ్ లు పని చేస్తున్నాయని అధికారులు చెప్పారు.
ఈరోజు ఢిల్లీలో జరిగే స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ప్రజలకు అనుకూలమైన విధంగా అన్ లాక్ నిబంధనలు సడలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పాజిటివ్ కేసుల సంఖ్య, క్వారంటైన్ కేంద్రాల్లో చేరేవారి సంఖ్య పెరగవచ్చు కానీ, కేసులలో ఎక్కువ భాగం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని హోం శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు.
దేశంలో 20 రాష్ట్రాల్లో రికవరీ శాతం మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా చూసుకుంటే 63 శాతం రికవరీ రేటు ఉందని, ఢిల్లీ 80 శాతం, గుజరాత్ 70 శాతం రికవరీ రేటు లో ఉన్నాయి. ఢిల్లీలో పరిస్గితులు ఇప్పడు కాస్త మెరుగు పడినప్పటికీ దాని చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. వాటి నియంత్రణపై కేంద్ర హోంశాఖ దృష్టి సారిస్తోందని మంత్రిత్వ శాఖలోని ఒక అధికారి తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ రావటానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని జూలై 3 న జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సమావేశంలో నివేదించారు. దేశరాజధాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కోవిడ్ నియంత్రణకు హోం శాఖ చేపట్టిన చర్యలను ప్రధాని ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని ఆయన సూచించారు.