Noel Tata
Tata Trusts New chairman Noel Tata: టాటా ట్రస్టుల నూతన చైర్మన్ గా నోయెల్ టాటా నియామకం అయ్యారు. బుధవారం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. రతన్ టాటా మరణం తరువాత టాటా ట్రస్టుల చైర్మన్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో పలువురు పేర్లు వినిపించాయి. నూతన చైర్మన్ ఎంపిక విషయంపై శుక్రవారం ముంబైలో ట్రస్ట్ బోర్డు సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రతన్ టాటా సవతి తల్లి సిమోన్ కుమారుడు, రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా నూతన చైర్మన్ గా ఎంపికయ్యారు. బోర్డు సభ్యులు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో నోయెల్ టాటా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read: దేశంలో ఎందరో వ్యాపార దిగ్గజాలు ఉన్నా.. ప్రజల మదిలో రతన్ టాటాకే ఎందుకు శిఖర స్థాయి?
టాటా గ్రూప్ తో నోయల్ టాటాకు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ వంటి కంపెనీలకు చైర్మన్ గా కూడా నోయల్ టాటా ఉన్నారు. టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెండ్ కి వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నాడు. రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ నోయల్ సభ్యుడిగా ఉన్నారు.
నోయల్ భార్య అలూ మిస్త్రీ. పల్లోంజి మిస్త్రీ కుమార్తె. ఈమె సోదరుడే టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత సైరస్ మిస్త్రీ. పల్లోంజి మిస్త్రీ గ్రూపునకు కూడా టాటా గ్రూపులో 18.4శాతం వాటా ఉంది. నోయల్, ఆలూకు ముగ్గురు పిల్లలు. లేహ, నెవిల్లె, మాయా. వీరు ప్రస్తుతం టాటా గ్రూప్ లో వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.