1250 కిలోల ప్లాస్టిక్ వేస్టేజ్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద ఛర్ఖా 

  • Publish Date - September 30, 2019 / 09:49 AM IST

మహాత్మా గాంధీ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చే మాట అహింస. తరువాత రాట్నం..అదే ఛర్ఖా. రాట్నంతో నూలు వడికేవారు గాంధీజీ. గాంధీజీ 150 జన్మదిన వేడుకలకు దేశమంతా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అథారిటీ సెక్టార్-94లో ప్లాస్టిక్‌వేస్ట్‌‌తో అతిపెద్ద చర్ఖాను తయారు చేయించింది. ఈ చర్ఖాను అక్టోబరు 1న ఎంపీ  డాక్టర్ మహేష్ శర్మ ప్రారంభించనున్నారు. 

గాంధీ 150 జన్మదిన వేడుకలు సందర్భంగా అక్టోబరు 2 నుంచి నోయిడా నగరాన్ని  ప్లాస్టిక్ ఫ్రీగా చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా సెక్టార్-94లో నోయిడా అథారిటీ 1250 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈ చర్ఖాను తీర్చిదిద్దింది. 14 అడుగుల ఎత్తు..20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్నఈ ఛర్ఖా బరువు 1650 కిలోల బరువు ఉంది. ఈ చర్ఖాలో కొంతమేరకు కలపను కూడా వినియోగించారు. ఇప్పటివరకూ ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన అతిపెద్ద చర్ఖాగా ఇది గుర్తింపు పొందింది. గిన్నీస్ బుక్ అధికారులకు నోయిడా అథారిటీ చర్ఖాకు సంబంధించిన సమాచారాన్ని పంపించింది. “నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్” అనే సందేశాన్ని ఇంటికి నడపడానికి ఉపయోగించబడే ఈ రకమైన చార్ఖలో ఇది మొదటిది కావటం విశేషం.  

భారత జాతిపిత మహాత్మా గాంధీ 150 వేడుకల్ని  ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా భారతదేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేలా అందరూ ఆలోచించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.