Noida Metro: ట్రాన్స్ జెంటర్లకు ‘ప్రైడ్ స్టేషన్’ అంకితం

  • Publish Date - October 28, 2020 / 10:50 AM IST

Delhi: Noida Metro ‘Pride Station’: నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (NMRC) ట్రాన్స్‌జెండర్లపై గౌరవాన్ని చూపిస్తు సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి (లింగమార్పిడి సమాజానికి) గౌరవ సూచకంగా సెక్టార్ 50 స్టేషన్‌ పేరును ‘ప్రైడ్ స్టేషన్’గా మార్చింది. ఓ స్టేషన్‌ను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి అంకితం చేసిన ఉత్తర భారతదేశంలోని తొలి మెట్రో రైల్ సర్వీస్‌గా ఎన్ఎంఆర్‌సీ రికార్డులకెక్కింది.


కాగా ఇప్పటికే 2017లో కేరళ రాష్ట్రంలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకుంది. 23 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలిచ్చి సంచలనం సృష్టించింది. ఇక.. నోయిడాలోని ‘ప్రైడ్ స్టేషన్’లో ఆరుగురు ట్రాన్స్‌జెండర్లను ఉద్యోగులుగా నియమించారు.


2011 జనాభా లెక్కల ప్రకారంగా చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా 4.9 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా, వారిలో 35 వేల మంది ఎన్‌సీఆర్ పరిధిలో నివసిస్తున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య మరింత పెరిగి ఉంటుందని ఎన్‌ఎంఆర్‌సీ పేర్కొంది.



లింగమార్పిడి ప్రజల హక్కుల పరిరక్షణ..వారి సంక్షేమం కోసం కృషి చేయడం కోసం కేంద్రం ఆమోదించిన ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (హక్కుల పరిరక్షణ) చట్టం 2019 ద్వారా ఈ చొరవ ప్రేరణ పొందింది.


“NMRC కుటుంబంలో భాగంగా లింగమార్పిడి సమాజంలో అర్హతగల సభ్యులను కలిగి ఉండటం చాలా గర్వంగా భావించామని అందుకే వారి గౌరవార్థం ఈ స్టేషన్‌కు ‘ప్రైడ్’ అని పేరు పెట్టామని మెట్రో యాజమాన్యం తెలిపింది. ట్రాన్స్ జెండర్లు సమాజంలో గర్వింగా జీవించాలని..వారిని చులకనభావంతో కాకుండా గౌరవభావంతో చూడాలని సూచించింది.