ఇండియన్స్‌కు కొత్త వ్యాధి ముప్పు.. మద్యం తాగకున్నా కాలేయంపై పెరుగుతున్న కొవ్వు నిల్వలు

non-alcoholic fatty liver disease: ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతా ఉరుకు పరుగుల జీవితం. శారీరక శ్రమ అస్సలు లేదు. ఎంతసేపూ ఏసీ రూముల్లో కంప్యూటర్ల ముందు కుర్చీల్లో గంటల తరబడి కూర్చోవడం. ఇక తినే తిండి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్ అంటూ నానా గడ్డి తింటున్నారు. చెత్తా, చెదారాన్ని కడుపులోకి పంపుతున్నారు. ఇలాంటి జీవనశైలి కారణంగానే భారతీయులకు కొత్త ముప్పు ఏర్పడింది. అదే.. నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్. అంటే.. కాలేయంపై కొవ్వు నిల్వలు పెరగడం.

మద్యం తీసుకునే అలవాటు లేకున్నా కాలేయంపై కొవ్వు నిల్వలు:
సాధారణంగా మద్యం తీసుకోవడం వల్ల కాలేయంపై(liver) కొవ్వు(fat) నిల్వలు పెరిగిపోతాయి. అయితే, మద్యం తీసుకునే అలవాటు లేకున్నా చాలామందిలో కాలేయంపై కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయి. గతి తప్పిన జీవనశైలి కారణంగానే ఈ పెనుముప్పు ఎదురవుతోందని డాక్టర్లు గుర్తించారు.
ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం.. తదితర కారణాల వల్ల 9-32 శాతం మంది భారతీయుల్లో మద్యంతో సంబంధం లేకుండా కాలేయంపై కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయి. దీన్నే వైద్య పరిభాషలో ‘నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ అని పిలుస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

అధిక రక్తపోటు(hypertension), మధుమేహం(diabetes), గుండెపోటు(stroke), పక్షవాతం(Paralysis), క్యాన్సర్‌(cancer) తరహాలోనే ‘కాలేయంపై కొవ్వు నిల్వలు’ పెరిగిపోవడాన్ని కూడా జీవనశైలి వ్యాధుల(నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌-ఎన్‌సీడీ) పరిధిలోకి కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా తీసుకొచ్చింది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తూ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఫ్యాటీ లివర్ వల్ల జరిగే ప్రమాదం:
సాధారణ ప్రజల్లో 20-30 శాతం మంది ‘ఫ్యాటీ లివర్‌’ ఉన్నవారుంటారు. కాలేయ కణాలపై దుష్ప్రభావం చూపనంత వరకూ, వాపు రానంత వరకూ ప్రమాదం లేదు. ప్రమాదకర స్థాయిలో కొవ్వు పేరుకుపోతే అనారోగ్యం తీవ్రమవుతుంది. కాలేయ కణాలు దెబ్బతిని వాపు వస్తుంది. కాలేయం కుంచించుకుపోతుంది(లివర్‌ సిర్రోసిస్‌). క్యాన్సర్‌కూ దారితీస్తుంది. ఊబకాయానికి తోడుగా మధుమేహం ఉన్నవారిలో 40-80 శాతం మందిలో ‘నాన్‌ ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌’ ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా తొలిదశలో వ్యాధి లక్షణాలేమీ కనిపించవు. పొట్టకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ లేదా సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేసినప్పుడే బయటపడుతుంది.

జీవనశైలిలో మార్పులు తప్పనిసరి:
* ప్రజలు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
* కొవ్వు పదార్థాలను తగ్గించాలి.
* రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయాలి.
* బరువు తగ్గాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి.
* పురుషులు తమ నడుము చుట్టుకొలత 90 సెం.మీ కంటే ఎక్కువగా, మహిళలు 80 సెం.మీ. కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి.
* ఆశా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో ఈ వ్యాధిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి.
* జనాభా ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు