Sharad Pawar : మోదీకి చెక్ పెట్టేందుకు పవార్ దూకుడు.. విపక్షాలతో కీలక భేటీ..!

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. తృతీయ కూటమి దిశగా విభిన్న రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తున్నాయి.

Sharad Pawar To Host Meeting

Sharad Pawar to host meeting : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. తృతీయ కూటమి దిశగా విభిన్న రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తున్నాయి. బీజేపీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దూకుడు పెంచారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో భేటీ తర్వాత మరో కీలక అడుగు వేశారు. బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి ముందుకు వచ్చే కాంగ్రెసేతర విపక్ష నేతలతో పవార్ నేడు(జూన్ 22,2021) కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

పలు పార్టీలకు ఇప్పటికే పవార్ పక్షాన ఆహ్వానాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కు మాత్రం పవార్ బృందం ఈ ఆహ్వానాన్ని పంపలేదు. కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నారు. శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఇద్దరూ ఈ భేటీకి అధ్యక్షత వహించనున్నారని, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారని తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని పవార్ ఇంట్లో 15 విపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. మిషన్ 2024 పేరుతో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనే లక్ష్యంగా చర్చలు సాగనున్నాయి.

ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ నేపథ్యంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతలతో భేటీపై పవర్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో రెండు వారాల వ్యవధిలోనే రెండోసారి పవర్ తో సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. మిషన్ 2024 లక్ష్యంగానే మంతనాలు జరిగి ఉంటాయని ఊహాగానాలు వినబడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11న ముంబైలో పవార్ వాసంలో భేటీ అయిన ఇరువురూ తాజాగా ఢిల్లీలో సమావేశమయ్యారు.