మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రంలో 1,622 గ్రామాల్లో నాణ్యమైన కూరగాయలు అందించే పైలట్ ప్రాజెక్టుగా ‘న్యూట్రీ గార్డెన్స్’ పేరుతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సేంద్రియసాగు మొదలైంది. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలను సాగుచేసే ప్రాజెక్టుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం శ్రీకారం చుట్టారు. ఏ గ్రామంలో పండించిన కూరగాయలను అదే గ్రామంలో విక్రయించేలా చూడనున్నారు. మిగిలితే సమీప గ్రామాల్లోనూ అమ్మే అవకాశం కల్పించారు. వీటి విక్రయం కోసం రైతులకు ప్రత్యేకంగా వాహనం సమకూర్చనున్నారు.
ఇటీవల గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన ఓ సర్వేలో ప్రధానంగా 15 ఏళ్ల నుంచే యువతులు, ఆ తర్వాత 45 ఏండ్ల లోపు మహిళల్లో రక్తహీత సమస్యతో తీవ్రంగా గురౌతున్నట్టు గుర్తించారు. నెలసరి సమయంలో 76 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడైంది. గ్రామీణ మహిళల ఆహారంలో కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటున్నప్పటికీ.. ఇతర సూక్ష్మపోషకాలు లేకపోవడంతో రక్తహీన సమస్యలు పెరుగుతున్నట్టు తేలింది.
మహిళల్లో రక్తహీనత సమస్యను తొలిగించాలంటే బలమైన ఆహారం అందించాలని, తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం న్యూట్రీ గార్డెన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో మహిళా సంఘాలనే ప్రధాన భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. దీనికోసం రూ.1 లక్షను పెట్టుబడి సాయంగా సెర్ప్ నుంచి విడుదల చేశారు.
దీంతోపాటుగా సెర్ప్ నుంచి ఎలక్ట్రానిక్ వాహనాన్ని కొనుగోలు చేసిచ్చారు. రూ.1.60 లక్షల విలువైన ఈ వాహనంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు వేర్వేరుగా అరలను ఏర్పాటు చేశారు. న్యూట్రీ గార్డెన్స్ 437 మండలాల్లోని 1,622 గ్రామాల్లో న్యూట్రీ గార్డెన్స్‌ను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు.
SC, ST వర్గాల నుంచి ఒక రైతు, BC, ఇతరవర్గాల నుంచి మరొక రైతును తీసుకుని.. వారితో అరెకరంలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరల సాగును చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలతో న్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటుచేపట్టారు. ఎలాంటి రసాయనిక ఎరువులను వినియోగించకుండా సాగు ప్రక్రియను మొదలుపెట్టారు.