Odisha Assembly
odisha assembly : అసెంబ్లీ అంటే సమస్యలపై చర్చించుకునే వేదిక కాకుండా ప్రజాప్రతినిధులు సర్కస్ ఫీట్లతో చట్టసభలు అభాసుపాలు అవుతున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకు వేదికగా చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఒడిశా అసెంబ్లీలో స్పీకర్ పైనే కుర్చీ ఎత్తారు ఓ ఎమ్మెల్యే..
ఒడిశాలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం (మార్చి 29,2022) అధికార ప్రతపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న గనుల అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి (MLA Taraprasad Bahinipati ) వాయిదా తీర్మానం ఇచ్చారు. కానీ దీనిపై స్పీకర్ ఎస్‌ఎన్ పాత్రో తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్యే తారాప్రసాద్ స్పీకర్ తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యారు. ఏకంగా స్పీకర్ పోడియంలోకి దూసుకుపోయి అక్కడ ఉన్న కుర్చీని పైకిలేపి ఎత్తేశారు. ఆ తరువాత ఆ కుర్చీని కిందపడేశారు. ఈ ఘటనతో అసెంబ్లీ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. దూషణలు ప్రతిదూషణలో సభ నిండిపోయింది.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ అయిన తారా ప్రసాద్.. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ అక్రమాలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. జీరో అవర్‌లో దానిపై చర్చించాలని పట్టుబట్టారు. దానికి స్పీకర్ తిరస్కరించారు. అనంతరం భోజన విరామం తర్వాత కూడా అదే అంశంపై చర్చకు అనుమతించాలని కోరాడు. గనుల యజమానులు అక్రమంగా మైనింగ్‌తో ఒడిశాను దోచుకుంటున్నారని ఆరోపించారు.
స్పీకర్ పాత్రో చర్చకు నిరాకరించడంతో ఎమ్మెల్యే తారాప్రసాద్ ఆవేశంతో ఊగిపోయారు. హెడ్‌ఫోన్స్ విరగొట్టారు. అక్కడితో ఆగలేదు. స్పీకర్ పాత్రో పోడియంలోకి దూసుకెళ్లారు. పోడియం ముందున్న కుర్చీని పైకెత్తి పడేయడంతో అది విరిగిపోయింది. కాగా, ఎమ్మెల్యే ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సభలో మీరు సీనియర్ సభ్యులు ఇటువంటి ప్రవర్తన తగదు’అంటూ సూచించారు.
కాగా..కాంగ్రెస్..బీజేపీ ఆరోపణలపై ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ స్పందిస్తూ .. మైనింగ్ అక్రమాలపై ఆరోపణలు చేయడం ప్రతిపక్ష సభ్యులకు అలవాటు. వారికి ఏ సమస్య లేనప్పుడు ఏదోకటి లేవనెత్తి రభస చేయటం వారికి అలవాటే అని ఎద్దేవా చేశారు.