Odisha Woman Sees Her Child Crawl Towards 8 Ft Long King Cobra
King Cobra : ఈ భూమ్మీద పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేది ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ మాత్రమే. పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది అమ్మ. వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా తల్లి హృదయం విలవిలలాడుతుంది. తన ప్రాణం అడ్డుపెట్టి పిల్లల ప్రాణాలు కాపాడుతుంది. వారికి ఎలాంటి హాని జరక్కుండా చూసుకుంటుంది. తాజాగా ఓ అమ్మ చూపిన ధైర్యం అందరినీ విస్మయానికి గురి చేసింది.
చిన్నపామును చూస్తేనే మనం వణికిపోతాం. అలాంటిది ఏకంగా 8 అడుగుల పాము.. అదీ కింగ్ కోబ్రా.. ఎదురుపడితే.. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ. కానీ, ఆ అమ్మ అస్సలు భయపడలేదు. 8 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా చేత్తో పట్టుకుంది. అంతేకాదు బయటకు తీసుకొచ్చి విసేరిసింది. ఈ ఘటన ఒడిశా మయూరభంజ్‌లో జరిగింది.
ఎలా వచ్చిందో కానీ, 8 అడుగుల కింగ్ కోబ్రా ఒకటి ఓ ఇంట్లోకి దూరింది. ఆ ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల బాబు పాము వైపు వెళ్తుండడం తల్లిదండ్రులు గమనించారు. అంత పెద్ద పాము కనిపించేసరికి.. వారికి ఒళ్లంతా చెమట్లు పట్టాయి. పిల్లాడి తండ్రి స్పందించి కొడుకును పట్టుకోగలిగాడు. అదే క్రమంలో పిల్లాడి తల్లి (సస్మిత) సాహసం చేసింది. పాము తోక పట్టుకుని బయటకు లాక్కొచ్చి విసిరేసింది. ఆ సీన్ చూసి అంతా హడలిపోయారు. అనంతరం వాళ్లు ఫారెస్ట్ అధికారులను పిలిపించారు. వారు ఆ పాముని పట్టుకుని అడవిలో వదిలారు.
ఆ పాము చాలా ప్రమాదకరమైనదని తెలుసు. కాటు వేస్తే ఖతమే అనీ తెలుసు. అయినా ఆ అమ్మ భయపడలేదు. మరేమీ ఆలోచన చేయలేదు. బిడ్డ క్షేమం కోసం సాహసం చేసింది. చేత్తో పాముని పట్టుకుని బయట విసిరేసింది. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తన బిడ్డకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోననే భయంతో ఇంతటి ధైర్యం చేసినట్లు ఆమె తెలిపింది. ఆ అమ్మ చూపిన గట్స్ కి ప్రశంసలు లభిస్తున్నాయి. అదీ అమ్మ అంటే, అమ్మ ప్రేమంటే.. అని కామెంట్స్ చేస్తున్నారు.