OFB corporatisation : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటీకరణకి కేబినెట్ ఆమోదం

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(OFB)వునర్వ్యవస్థీకరణకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

OFB Corporatisation కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆయుధ కర్మాగార బోర్డు(OFB)వునర్వ్యవస్థీకరణకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుధాలు, సైనిక సంబంధ పరికరాల ఉత్పత్తి కోసం OFB ఆధ్వర్యంలో ఉన్న 41 ఫ్యాక్టరీలను.. ప్రభుత్వ ఆధీనంలోని 7 కార్పొరేట్‌ కంపెనీలుగా విభజించే దీర్ఘకాల ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. రక్షణ ఉత్పత్తిలో భారత్ ను స్వయం సమృద్ధిగా ఉంచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ఓఎఫ్‌బీలో ఉన్న దాదాపు 70,000 మంది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. జవాబుదారీతనం, సమర్థత, పోటీతత్వాలను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

కార్పొరేటీకరణ నిర్ణయంతో ఓఎఫ్ బీ స్వయంప్రతిపత్తి మరింత మెరుగుపడి, ఆయుధాల సరఫరాలో జవాబుదారీతనం, సామర్థ్యం పెరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ఉత్పత్తి యూనిట్లకు చెందిన OFB (గ్రూప్ A,B,C) ఉద్యోగులందరినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తూ వారి సర్వీస్ కండీషన్స్ మార్చకుండా డీమ్డ్ డిప్యుటేషన్‌పై కార్పొరేట్ సంస్థలకు ప్రారంభంలో రెండేళ్ల కాలానికి బదిలీ చేయబడతారని ఆ అధికారి తెలిపారు. పదవీ విరమణ చేసినవారు మరియు ఉన్న ఉద్యోగుల పెన్షన్ బాధ్యతలు ప్రభుత్వం భరిస్తూనే ఉంటుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు