Building Demolition: 70కోట్లతో నిర్మించిన ట్విన్ టవర్స్‌ను కూల్చేందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా?

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో నిర్మించిన ట్విన్ టవర్స్ ను ఆదివారం కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Twin Towers

Building Demolition: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో నిర్మించిన ట్విన్ టవర్స్ ను ఆదివారం కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ట్విన్ టవర్స్ నిర్మాణానికి రూ. 70కోట్లు వెచ్చించారు. అయితే ఈ రెండు టవర్స్ ను కూల్చేందుకు సుమారు రూ. 20కోట్లు ఖర్చు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు ఈ ట్విన్ టవర్స్ ను కూల్చేందుకు ముహూర్తాన్నిసైతం ఫిక్స్ చేశారు. 2014లో అలహాబాద్ హైకోర్టు ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని ప్రకటించడంతో, జంట టవర్లను కూల్చివేయాలనే నిర్ణయాన్ని  ఆగస్టు 18 సుప్రీంకోర్టు ఆమోదించింది. వాస్తవానికి ఈ నెల 21న కూల్చివేయాలని నిర్ణయించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కూల్చివేత తేదీని ఆగస్టు 28కి పొడిగించారు.

Twin Towers

నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ కంపెనీ 2009లో రూ. 70 కోట్ల వ్యయంతో ఈ టవర్లను నిర్మించింది. ఈ టవర్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో కూల్చివేసేందుకు అక్కడి పాలకవర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో వీటిని కూల్చివేసేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. ఈ రెండు టవర్లలో పేలుడు పదార్థాలను అమర్చడం ఇప్పటికై పూర్తయింది. ప్రస్తుతం బాంబులను ఒకదానికొకటి అనుసంధానం చేస్తున్నారు. ఈ కూల్చివేత బాధ్యతను ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారు. కూల్చివేత సమయంలో చుట్టుపక్కల ఉన్న భవనాలకు దుమ్ముపట్టకుండా కవర్లతో కప్పి ఉంచారు. నియంత్రిత ఇంప్లోషన్ టెక్నిక్ ద్వారా ఈ కూల్చివేత ప్రక్రియ జరుగుతుందని అధికారులు తెలిపారు.

Twin Towers

ఇదిలాఉంటే ఈ ట్విన్ టవర్స్ కూల్చడం వల్ల దాదాపు 1200 నుంచి 1300 ట్రక్ లోడ్ల శిథిలాలను సైట్ నుంచి తరలించాల్సి ఉంటుంది. అన్ని పేలుడు పదార్థాలు పెద్ద శబ్దం చేస్తూ వరుసలో పేలడానికి తొమ్మిది నుంచి 10 సెకన్లు పడుతుంది.  కూల్చివేత సమయంలో పది నుంచి 15 నిమిషాల పాటు దుమ్ము విపరీతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ ట్విన్ టవర్స్ ను కూల్చివేసే సంస్థ.. గతంలో కేరళలోని మరాడు, తెలంగాణ సచివాలయం, సెంట్రల్ జైలు, గుజరాత్ లోని మోటేరా స్టేడియంలో అక్రమ నివాస సముదాయాలను కూల్చివేసింది. ట్విన్ టవర్స్ ను కూల్చివేసే క్రమంలో పరిసర ప్రాంతాల్లోని 5వేల మంది నివాసితులను ఆగస్టు 28న ఉదయం 7.30గంటలలోపు ఖాళీ చేయాలని, మళ్లీ అధికారులు అనుమతి ఇచ్చిన తరువాత రావాలని అధికారులు సూచించారు.