కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్, సెప్టెంబర్ నాటికి భారత్‌లో కోటి కేసులు, స్టడీ

  • Publish Date - July 25, 2020 / 08:18 AM IST

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రంగా విశ్వరూపం దాల్చనుందా? సెప్టెంబర్‌లో కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందా? దేశంలో కోటి కొవిడ్ కేసులు నమోదు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. సెప్టెంబర్ నాటికి దేశంలో కోటి కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. మొదట్లో పదుల సంఖ్యలో, ఆ తర్వాత వందల్లో, ఇప్పుడు వేలల్లో నమోదవుతున్న కేసులు.. అతి త్వరలోనే దేశంలో రోజుకు లక్ష వరకు నమోదయ్యే చాన్స్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెంది, మనోధైర్యం కోల్పోవద్దని వైద్య నిపుణులు సూచించారు. కరోనా సోకి, లక్షణాలు కనిపించిన వారిలో 90శాతానికి పైగా కోలుకుంటున్నారని గుర్తు చేశారు.

దేశంలో త్వరలో రోజుకు లక్ష కేసుల నమోదు?
దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య పదులు, వందల నుంచి పెరిగిపెరిగి.. 50 వేల కేసులకు చేరువైంది. మొన్న 45వేల కేసులు.. నిన్న 49 వేల కేసులు. లాక్‌డౌన్‌ ఉన్నన్నాళ్లూ కంట్రోల్ లో ఉన్న కేసుల సంఖ్య.. ఆంక్షల సడలింపుతో ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతోంది. రాబోయే నాలుగైదు వారాలూ తెలంగాణకు చాలా క్లిష్టమైన సమయం అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండబోతోందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

13.8కోట్ల మందికి కరోనా సోకుతుందని అంచనా:
జూలై చివరి నాటికి లేదా అంతకు ముందే 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతాయని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ ఇన్‌ చెన్నై’కి చెందిన పరిశోధకులు జూన్‌ రెండో వారంలో అంచనా వేశారు. వారి అంచనా నూటికి నూరుపాళ్లూ నిజమైంది. ఈ వేగం ఇలాగే కొనసాగితే ఆగస్టు రెండో వారంలో లేదా మూడోవారానికి దేశంలో కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరుతుందని తమిళనాడుకు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ జాకబ్‌జాన్‌ హెచ్చరించారు. పతాకస్థాయి అంటే.. దేశ జనాభాలో 10 శాతానికి (దాదాపుగా 13.8 కోట్ల మందికి) వైరస్‌ సోకుతుందని ఆయన అంచనా.

ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత ముప్పు:
సెప్టెంబర్‌ చివరి దాకా కరోనా విధ్వంసం ఇలాగే నిర్విరామంగా కొనసాగుతుందని.. ఐఐటీ ఖరగ్‌పూర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ అభిజిత్‌ దాస్‌ కూడా హెచ్చరించారు. ఇక.. బెంగళూరులోని ఐఐఎస్సీ బృందం వేసిన సిక్స్‌ డైమెన్షనల్‌ అంచనాల ప్రకారం.. కేసులు ఇలాగే పెరిగితే సెప్టెంబర్ 30 నాటికి దేశంలో 66 లక్షల కేసులు నమోదవుతాయి. అమెరికాకు చెందిన ప్రిన్స్‌టన్‌ వర్సిటీ అంచనాల ప్రకారం.. సెప్టెంబర్ నాటికి దేశంలోని ఆస్పత్రుల్లో ఉన్న పడకలు, వెంటిలేటర్లు సరిపోయే పరిస్థిత ఉండదు. గణాంకాలను పరిశీలిస్తే.. మన దేశంలో కేసుల సంఖ్య 1000 నుంచి లక్షకు చేరుకోవడానికి 51 రోజులు పట్టింది. కానీ, అక్కణ్నుంచి 10 లక్షల కేసులకు కేవలం 59 రోజుల్లో చేరుకుంది.

2021 నాటికి భారత్‌లో రోజుకు 2.87 లక్షల కేసులు:
ప్రముఖ ఆరోగ్య ఆర్థికవేత్త డాక్టర్‌ రిజో ఎం జాన్‌ అంచనాల ప్రకారమైతే.. ఆగస్టు 10-11 తేదీల నాటికి దేశంలో కేసుల సంఖ్య 20లక్షలు, ఆగస్టు నెలాఖరుకు 32 లక్షలు దాటనుంది. జూలై 22 నాటికి దేశంలో కేసుల సంఖ్య 10 లక్షలు దాటుతుందని జూన్‌ 8న ఆయన అంచనా వేశారు. ఆయన చెప్పినదాని కన్నా ముందే.. జూలై 16 నాటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటడం గమనార్హం. ఇక.. సరైన వ్యాక్సిన్‌ రాకుండా.. వైరస్‌ వ్యాప్తి ఇలాగే కొనసాగితే 2021 నాటికి భారత్‌లో రోజుకు 2.87 లక్షల కేసులు నమోదవుతాయని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

ప్రతి 15 రోజులకూ 1.68 రెట్లు:
కేంద్రం విడుదల చేస్తున్న గణాంకాల ప్రకారం.. గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రతి పదిహేను రోజులకూ 1.68 రెట్ల చొప్పున పెరుగుతోంది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే.. సెప్టెంబర్ 22 నాటికి కేసుల సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 12.87 లక్షలు.. 60 రోజుల తర్వాత కోటి.. అంటే రెండు నెలల్లో దాదాపు 89 లక్షల కేసులు. సగటున రోజుకు దాదాపు లక్షకు పైగా కేసులు నమోదయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

సెప్టెంబర్ 22 నాటికి కోటి కేసులు:
ఇక.. దేశంలో నమోదైన కేసులతో పోలిస్తే యాక్టివ్‌ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి దాదాపుగా 34 శాతంగా ఉంది. ఈ దామాషా ప్రకారం చూస్తే.. సెప్టెంబర్ 22 నాటికి కోటి కేసులకుగాను యాక్టివ్‌ కేసుల సంఖ్య 34.88 లక్షల దాకా ఉంటుంది. అందులో 5 శాతం మందికి.. అంటే దాదాపు 1.74 లక్షల మందికి ఐసీయూ పడకలు అవసరమవుతాయని అంచనా. కానీ కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఉన్నవి.. 50 వేల లోపు ఐసీయూ పడకలే! దీనివల్ల వైద్య వ్యవస్థలపై రానున్న రెండు నెలల్లో పెనుభారం పడే ముప్పుంది.

కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఏం చేయాలి:
కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా రోజుకు 49 వేలకు చేరి.. ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యల గురించి వైద్యనిపుణులు చేస్తున్న సూచనలివి
* వీలైనంత విస్తృతంగా టెస్టుల సంఖ్య పెంచాలి
* పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులను కొవిడ్‌ కేంద్రాలుగా మార్చాలి
* మండల స్థాయిలో సామూహిక ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
* ఇంట్లో ఐసోలేషన్‌ సౌకర్యం లేని వారిని.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉంచొచ్చు
* వైరస్‌ తీవ్రతను బట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు వ్యుహాలను అమలు చేయాలి
* ఇంటింటి సర్వే చేసి పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా సీరియస్‌ రోగులను ముందే గుర్తించి, వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించాలి
* గ్రామాల్లో ఆశా, ఎఎన్‌ఎంలకు తోడుగా అవసరమైతే ఆర్‌ఎంపీ సేవలను కూడా వాడుకోవాలి

మనోధైర్యమే అతి పెద్ద మందు, కోల్పోవద్దు:
సెప్టెంబర్ నాటికి దేశంలో కోటి కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలతో ప్రజలు ఆందోళన చెందొద్దని, మనోధైర్యం కోల్పోవద్దని వైద్య నిపుణులు సూచించారు. కరోనా సోకి, లక్షణాలు కనిపించిన వారిలో 90 శాతానికి పైగా చికిత్సతో కోలుకుంటున్నారని చెప్పారు. ఆక్సిజన్‌ అవసరమైనవారిలో సైతం రికవరీ రేటు 66 శాతంగా ఉందన్నారు. ఏ లక్షణాలూ కనిపించని వారిలో 85 శాతం మందికి అసలు తమకు వైరస్‌ సోకినట్టు, తగ్గినట్టు కూడా తెలియదన్నారు. కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య అత్యంత స్వల్పంగా ఉందన్నారు. వారిలో కూడా కొందరు.. తమకు వైరస్‌ సోకిందన్న ఆందోళన, భయంతోనే ప్రాణాలు కోల్పోతున్నారని వైద్య నిపుణులు వివరించారు. కాబట్టి.. భయపడకుండా కరోనా వైరస్ ను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మనోధైర్యమే దీనికి అతి పెద్ద మందు అని స్పష్టం చేశారు.