విశ్లేషణ: ఉల్లి లొల్లి.. ధరల కన్నీళ్లకు కారణాలు ఇవే!

  • Publish Date - December 2, 2019 / 06:32 AM IST

దేశంలో ఉల్లి లొల్లి విపరీతంగా ఉంది. ఉల్లిపాయ కోస్తుంటే రావలసిన కన్నీళ్లు కొంటుంటేనే వస్తున్నాయి. అమాంతం ఆకాశానికి చేరిపోయాయి ధరలు. సామాన్యులు ఉల్లి కొనే పరిస్థితి లేదు. ఉత్తర భారతదేశంలో ఉల్లి ధరల ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ ఉల్లిని ప్రభుత్వాలు సబ్సీడీ ద్వారా అందిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే ఉల్లిపాయల ధర ఇటీవల కాలంలో మార్కెట్లో రూ.100 మార్క్‌ను దాటిపోయింది. కోల్‌కతా నుంచి చెన్నై వరకు పలు నగరాల్లో ఉల్లిపాయల ధర ప్రస్తుతం సెంచరీ కొట్టేసింది. ఇంకా కొన్ని చోట్ల సెంచరీ దాటి రూ. 120 కూడా చేరుకుంది.

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు…ఉల్లి ధర కొండెక్కడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిజానికి దేశంలోని ఉల్లి మార్కెట్లలో మహారాష్ట్ర, కర్నాటక ప్రధానమైన రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగా సాగు అవుతూ ఉంటుంది. అయితే ఈ ఏడాది అధిక వర్షాలు కారణంగా ఉల్లి పంట విపరీతంగా దెబ్బతింది.
 
ఖరీఫ్‌ సీజన్‌లో ఉల్లిసాగు విస్త్రీర్ణం 40 శాతం తగ్గింది. డిమాండుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ఫలితంగా ధరలు పెరగడంతో సామాన్యులు కళ్ల వెంబడి నీళ్లు వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. ఉల్లి వ్యాపారులు సాధారణంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని అమ్ముతుంటారు.

అలా మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లారీల్లో తీసుకురావాలంటే కిలో ఉల్లి తరలింపునకు నాలుగైదు రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే అక్కడ మార్కెట్లోనే ఉల్లి ధర ఎక్కువగా ఉండడంతో కొనుగోలు, రవాణా ఛార్జీలు కలుపుకుని ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇక మధ్యవర్తులు, వ్యాపారుల వాటా పోయి, వినియోగదారుడి సంచిలోకి చేరేసరికి తడిసి మోపెడవుతోంది.

మరోవైపు ఉల్లి ధర పెరుగుతుండడంతో పుట్టుకు వచ్చిన బ్లాక్ మార్కెట్‌‌ ఇప్పుడు రెక్కలపై వీర విహారం చేస్తుంది. ధరల పెరుగుదలను అంచనా వేసే వ్యాపారులు ఉల్లిని భారీగా గోడౌన్స్‌లో స్టాక్ చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్‌ బెడద లేకపోతే ఉల్లి ధరల విషయంలో కాస్త ఉపశమనం లభించేది. కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా మార్కెట్లను బెంబేలెత్తించి, ధరలు పెంచుకుని అమ్ముకుంటున్నారు వ్యాపారులు. అంతేకాదు 2019-20 ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి పంట దిగుబడి ఏకంగా 26 శాతం తగ్గింది. 52.06 లక్షల టన్నులుగా నమోదైంది.  
 
ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా ఉల్లి మారింది. దేశంలో ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. టర్కీ దేశం నుంచి 11వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్టు నుంచి 6వేల 90 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టర్కీ, ఈజిప్టు దేశాల నుంచి ఉల్లి దిగుమతికి కేంద్ర పౌరసరఫరాల మంత్రిత్వశాఖ ఆదేశాలతో మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్డరు పెట్టింది. ఈజిప్టు నుంచి ఉల్లిగడ్డల రవాణ డిసెంబరు రెండో వారానికల్లా అవుతాయని కేంద్రం చెబుతుంది.