Operation Tiger in Maharashtra : మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ షురూ.. ఏంటీ ఆపరేషన్ టైగర్.. ఏం జరుగుతోంది? ఉద్ధవ్ థాక్రేకు టెన్షన్ ఎందుకు..
Operation Tiger in Maharashtra : ఉద్ధవ్ వర్గానికి చెందిన ఏడుగురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని.. ఎమ్మెల్యేల్లోనూ 16మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన ఎమ్మెల్సీ కృపాల్ తుమనే వ్యాఖ్యలతో ఆపరేషన్ టైగర్ చుట్టూ చర్చ మొదలైంది.
- Harish Thanniru
- Published on- June 16, 2026 / 10:56 PM IST
Operation Tiger in Maharashtra
Operation Tiger in Maharashtra : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బెంగాల్‌లో మమతా బెనర్జీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. 28ఏళ్ల పార్టీ చరిత్రలో టీఎంసీ ఎప్పుడూ ఈ స్థాయిలో సంక్షోభాన్ని చూడలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పెద్దలతో దీదీ, అభిషేక్ వరుస భేటీలు నిర్వహించడం.. అఖండ కాంగ్రెస్ డిమాండ్‌లు బలంగా వినిపిస్తుండడంతో.. పార్టీని కాపాడుకునేందుకు మమత ఏం చేయబోతున్నారు.. ఎలాంటి అడుగులు వేయబోతున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఐతే బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు కొనసాగుతున్న వేళ.. ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ మొదలైంది. బెంగాల్‌లో టీఎంసీకి ఎంపీలు హ్యాండ్ ఇచ్చినట్లు.. మహారాష్ట్రంలో శివసేన ఉద్ధవ్ పార్టీ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినట్లు అయింది. 2022నాటి పరిణామాలు గుర్తు చేసుకుంటూ.. ఉద్ధవ్‌కు మరో ఝలక్ తప్పదా అనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.
Also Read : Tanish : పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ.. ఒక సైనికుడి కొడుకుగా బాధపడుతున్నా.. తనీష్ వ్యాఖ్యలు..
సరిగ్గా నాలుగేళ్ల కింద.. 2022 జూన్‌లో.. మహారాష్ట్ర రాజకీయాల్లోనే అతిపెద్ద తిరుగుబాటు కనిపించింది. శివసేన నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్లి ఏక్‌నాథ్ షిండే ఆ పార్టీని ముక్కలు ముక్కలు చేశారు. ఆ తర్వాత కమలం పార్టీతో షిండే చేతులు కలపడం.. బీజేపీ అధికారం దక్కించుకోవడంలో.. విల్లు బాణం గుర్తు కూడా షిండే వర్గానికే రావడంతో.. ఉద్ధవ్ థాక్రేకు భారీ ఝలక్ తగిలింది. ఐతే ఇప్పుడు అలాంటి షాకే మళ్లీ తగలబోతుందా అంటే.. అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆపరేషన్ టైగర్ అనే ప్రచారం ఉద్ధవ్ థాక్రేకు నిద్రలేకుండా చేస్తుందనే చర్చ నడుస్తోంది. శివసేన యూబీటీలో అంతర్గత అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు.. ఎన్డీయే కూటమి వైపు వెళ్లొచ్చనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయ్. శివసేన ఉద్ధవ్ వర్గం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నా.. కనిపిస్తున్న కొన్ని పరిణామాలు మాత్రం.. భారీ సంచలనానికి దారి తీయడం ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయ్. శివసేన యూబీటీకి ప్రస్తుతం 9మంది ఎంపీలు ఉండగా.. అందులో ఏడుగురు ఎంపీలు ఎన్డీయే నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్.
ఉద్ధవ్ థాక్రేకు తిరుగుబాట్లు కొత్తేం కాదు.. 2022లో షిండే వర్గం తిరుగుబాటుతో.. ఉద్ధవ్ సర్కార్ కూలిపోయింది. ఆ తర్వాత శివసేన రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ పేరు, గుర్తు కోసం కూడా.. చాలా రోజులు న్యాయపోరాటాలు జరిగాయ్. ఐతే షిండే వర్గాన్నే అధికారిక శివసేనగా గుర్తించిన ఎన్నికల సంఘం.. విల్లు బాణం గుర్తు వారికే కేటాయించింది. దీంతో ఉద్ధవ్ వర్గం శివసేన ఉద్ధవ్ బాలసాహెబ్ థాక్రే పేరు.. కాగడా గుర్తుతో కొనసాగుతోంది. నాలుగేళ్ల కింద జరిగిన పరిణామాలు ఎఫెక్ట్ ఉద్ధవ్‌ను ఇప్పటికీ వెంటాడుతుంటాయ్. ఇలాంటి టైమ్‌లో ఇప్పుడు మళ్లీ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు రెడీ అయ్యారనే ప్రచారం.. ఆయనను మరింత టెన్షన్ పెడుతోంది. ఆపరేషన్ టైగర్ ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. పార్టీ ఎంపీలతో ఉద్ధవ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో జరిగిన పరిణామాలు.. ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.
ఉద్ధవ్ వర్గానికి చెందిన ఏడుగురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని.. ఎమ్మెల్యేల్లోనూ 16మంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన ఎమ్మెల్సీ కృపాల్ తుమనే వ్యాఖ్యలతో ఆపరేషన్ టైగర్ చుట్టూ చర్చ మొదలైంది. ఇక అటు ఉద్ధవ్ నిర్వహించిన సమావేశానికి.. నలుగురు ఎంపీలు మాత్రమే ప్రత్యక్షంగా హాజరయ్యారు. మిగతా ఐదుగురు ఆన్‌లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నా.. ఈ పరిణామం పార్టీలో అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇక సమావేశానికి హాజరుకాని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్.. షిండే వర్గానికి చెందిన కేంద్రమంత్రి ప్రతాప్ జాదవ్‌ను కలవడం.. ఇప్పుడు ఉద్ధవ్‌తోనే ఉన్నాను రేపటి గురించి అడగొద్దు అంటూ మరో ఎంపీ వక్చౌరే వ్యాఖ్యలు చేయడం.. చీలిక అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయ్. ఇక ఈ మీటింగ్‌కు ఒక్కరోజు ముందు జరిగిన ఆదిథ్య థాక్రే పుట్టినరోజు వేడుకలకు కూడా ఈ ఐదుగురు ఎంపీలు దూరంగా ఉన్నారంటే సీన్ అర్థం చేసుకోవచ్చు.
ఎవరికైనా పార్టీ విడిచి వెళ్లాలనిపిస్తే వెళ్లొచ్చని.. ఎంపీలతో మీటింగ్‌లో ఉద్ధవ్ వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం.. రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తోంది. ఐతే ఆయన అలాంటి మాటలు అనలేదని సంజయ్ రౌత్‌లాంటి వాళ్లు ఖండిస్తున్నా.. ఆపరేషన్ టైగర్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య.. జూన్ 19న జరగనున్న శివసేన వ్యవస్థాపక దినోత్సవం, 22న జరగనున్న ఎంపీల సమావేశంపై ఇప్పుడు అందరి ఆసక్తి కనిపిస్తోంది. ఆ రెండు రోజుల తర్వాత చీలిక ప్రచారానికి ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే.. అసలీ వివాదం అనేది ఏడుగురు ఎంపీల గురించే కాదు.. 2022లో జరిగిన తిరుగుబాటు రిపీట్ కాకుండా ఉద్ధవ్ ఆపగలరా లేదా అనేది అతిపెద్ద పరీక్ష. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు.. ఉద్ధవ్ థాక్రే గ్రూప్‌కు చెందిన ఎంపీలు.. షిండే నేతృత్వంలోని శివసేన వైపు ఫిరాయించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే.. లోక్‌సభలో ఎన్డీయే బలం మరింత పెరగడం ఖాయం.
టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు.. కొత్త చర్చకు దారి తీస్తోంది. ఆ 20మంది ఎంపీలు.. NCPI నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో చేరాలని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి, విలీనానికి సంబంధించిన లేఖ కూడా సమర్పించారు. తిరుగుబాటు టీఎంసీ ఎంపీలకు నాయకత్వం వహిస్తున్న కాకోలీ ఘోష్.. పార్లమెంటులో తమకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా అభ్యర్థించారు. NCPIలో చేరడమే కాదు.. ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని ఎంపీలు ప్రకటించారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా.. జాతీయ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు దారితీసింది. అసలేంటీ పార్టీ అనే డిస్కషన్ మొదలైంది. 2023 త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసింది. ఏడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని అనుకున్నా.. నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయ్. చివరకు రెండు స్థానాల్లో మాత్రమే.. పార్టీ గుర్తుపై అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆ రెండు స్థానాల్లో కలిపి మొత్తం 822 ఓట్లే వచ్చాయ్ ఆ పార్టీకి !
ఎంపీ, ఎమ్మెల్యేలు కాదు కదా.. ఒక్క వార్డుసభ్యుడైనా లేని NCPI.. ఇప్పుడు స్పీకర్ ఆమోదిస్తే లోక్‌సభలో పెద్ద పార్టీల సరసన చేరనుంది. బ్యాంకు ఖాతాలో కేవలం 75 రూపాయలు మాత్రమే ఉన్న పార్టీలోకి.. 20మంది ఎంపీలు ఎందుకు చేరుతున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వెంటాడుతోంది. డైరెక్ట్‌గా బీజేపీలో చేరితే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయ్. దీంతో ఈ పార్టీని తిరుగుబాటు ఎంపీలు ఎంచుకున్నారు. పార్లమెంట్‌లో తమ సంఖ్యాబలాన్ని కాపాడుకుంటూనే, సాంకేతికంగా అనర్హత వేటు పడకుండా చూసుకోవడానికి ఈ అనామక పార్టీ వీరికి పెద్ద అసెట్‌గా మారింది. నిజానికి మొదట్లో తిరుగుబాటు ఎంపీలు మూడింట రెండొంతుల మెజారిటీతో విడిపోయి.. స్వతంత్ర బ్లాక్‌గా ఏర్పడి.. ఎన్డీయేకి మద్దతివ్వాలని భావించారు. ఐతే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం.. స్వతంత్ర గ్రూపుగా విడిపోవడానికి సాంకేతిక అడ్డంకులు ఉన్నాయ్. ఈ చట్టపరమైన అడ్డంకిని అధిగమించడానికి NCPI వీరికి ఒక చట్టబద్ధత కల్పించినట్లు అయింది.
ఇలా బెంగాల్‌లో కొత్త రాజకీయ క్రీడ ముగియక ముందే.. మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆపరేషన్ టైగర్ చర్చకు దారి తీస్తోంది. మొదట బెంగాల్‌లో ప్రకంపం మొదలైంది.. ఇప్పుడు మహారాష్ట్రలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయ్. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. దీంతో పట్టు మరింత బిగించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందనేది మరికొందరి ఆరోపణ. ఇదంతా ఎలా ఉన్నా.. నిన్న బెంగాల్.. నేడు మహారాష్ట్ర.. మరి రేపు ఏంటి అనే ప్రశ్న తెరమీదకు వస్తోంది. ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది మరికొందరి వాదన. కమలం పార్టీ దెబ్బకు ప్రాంతీయ పార్టీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయనే చర్చ జాతీయస్థాయిలో వినిపిస్తోంది. ఇక బెంగాల్, మహారాష్ట్ర రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్న డీఎంకే.. తమిళనాడులో జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రాంతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకం కాబోతుందా అంటే.. వరుస పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది సీన్ ! మెజారిటీ రాష్ట్రాల్లో కమలం పార్టీ ఇలాంటి వ్యూహాలే అమలు చేసింది. ఇప్పుడు టీఎంసీ ఎంపీల నిర్ణయంతో.. బెంగాల్‌లో దీదీ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీల తిరుగుబాటుతో టీఎంసీకి.. పార్టీ గుర్తు కూడా కోల్పోయే అవకాశం ఉంది. దీంతో బెంగాల్‌లో దీదీ పార్టీ చరిత్రలో మిగిలిపోయే అవకాశాలే ఉన్నాయ్. టీఎంసీ మాత్రమే కాదు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలది ఇదే పరిస్థితి. తమిళనాడులో అన్నాడీఎంకే దాదాపు కూలిపోయే స్థితిలో ఉంది. రెండు సభల్లో కలిపి డీఎంకేకు 30మంది ఎంపీలు ఉన్నా.. ఇండియా కూటమి నుంచి బయటకు రావడంతో.. వాళ్లను పట్టించుకునే వాళ్లు కూడా ఉండరు. యూపీ ఫైర్‌బ్రాండ్ అని పేరు ఉన్న మాయావతి పార్టీ.. ఇప్పుడు జీరోకు పడిపోయిన పరిస్థితి. ఇక బిహార్‌లో జేడీయూ, కర్ణాటకలో జేడీఎస్.. బీజేపీకి సపోర్టుగా ఉండేలా ఒకరకమైన చట్రంలో ఆగిపోయాయ్. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీల మధ్యే పోటీ. ఇక ఒడిశాలో ఒకప్పుడు బీజేడీతో కలిసి పొత్తులో ఉన్న బీజేపీ.. ఇప్పుడు ఆ పార్టీని పక్కకు నెట్టి అధికారం దక్కించుకుంది. ఇలా దూకుడు తగ్గి కొన్ని రాష్ట్రాల్లో.. అసలు ఉనికే ప్రశ్నార్థకం అయినట్లు మరికొన్ని రాష్ట్రాల్లో.. ప్రాంతీయ పార్టీల తీరు కనిపిస్తోంది.
ఒకటి మాత్రం నిజం.. భారత రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం. స్థానిక ఆకాంక్షలు, ప్రాంతీయ సెంటిమెంట్లు జాతీయ పార్టీల ద్వారా నెరవేరవనే నమ్మకంతో.. ఒకప్పుడు వెలుగులోకి వచ్చిన ప్రాంతీయ శక్తులు.. ఇప్పుడు తీవ్ర అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకప్పుడు దేశాన్ని శాసించిన ప్రాంతీయ శక్తులు.. ఇప్పుడు రక్షణాత్మక ధోరణిలో పడ్డాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. బెంగాల్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు.. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్.. ఇలాంటి పరిస్థితుల మధ్య.. రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతుంది.. ఏం జరగబోతుందనే చర్చ ఆసక్తి రేపుతోంది.
