నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయల్లో ఉంటాయి,పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయని అనుకుంటాం. కానీ ఏ ఆస్తి లేని ఉత్తరప్రదేశ్ చెందిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జమునా ప్రసాద్ బోస్(94)జీవితం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలోని కిన్నీ నక్కా గ్రామంలో 1925లో జన్మించారు జమునా ప్రసాద్. చిన్నతనం నుంచి సోషలిస్ట్ భావాలు కలిగిన ఆయన సోషలిస్ట్ ఉద్యమంలో పాల్గొన్నారు.1962లో ఆయన మొదటిసారిగా సోషలిస్టు పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రీ నిగమ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1967లో మళ్లీ లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.1969లో అసెంబ్లీకి పోటీ మళ్లీ ఓటమి చవిచూశారు. 1974లో తిరిగి సోషలిస్టు పార్టీ నుంచి పోటీచేసి బందా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977లో యూపీ సర్కారులో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.
1985లో తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. 1989లో ములాయం సర్కారులో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటికి కూడా ఆయన ఖాదీ దుస్తులనే ధరిస్తుంటారు. ఎన్నికల్లో గెలవడమంటే డబ్బుతో కాదని, నీతి నియమాలు, సిద్ధాంతాలతోనని ఆయన చెబుతుంటారు. పెన్షన్ డబ్బులతోనే కాలం వెళ్లదీస్తున్న ఆయన ప్రస్తుతం ఆయన యూపీలోని బందాలో అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నాడు.ఐదేళ్ల క్రితం యూపీ మాజీ మంత్రి శివపాల్ సింగ్ బాందా వచ్చినపుడు జమునా ప్రసాద్ కు ఇంటిని మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు.
జమునా ప్రసాద్ బోస్ ఎప్పుడూ తనకోసం ఆలోచించలేదని,నిత్యం ప్రజలకోసమే ఆలోచిస్తాడని,పూర్వీకుల నుంచి ఉన్న ఇంటిని చెల్లెలు పెళ్లి కోసం అమ్మేసి అద్దె ఇంట్లో గడుపుతున్నాడని ప్రసాద్ స్నేహితుడు తెలిపారు. తనకు జీవితంలో ఎటువంటి రిగ్రీట్స్ లేవని జమునాప్రసాద్ చెబుతారు.స్నేహితులు,బంధువులు నువ్వు ఇది చేశావ్..అది చేశావ్ అని చెబుతుంటే చిరునవ్వు నవ్వి సంతోషపడతానని ఆయన తెలిపారు. జమునాప్రసాద్ భార్య చాన్నాళ్ల క్రితమే చనిపోయింది. ప్రసాద్కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. అయితే వీరందరూ వేర్వేరుగా కాపురముంటున్నారు.తండ్రి గురించి మాత్రం వీరు పట్టించుకోరు.