Out On Bail Delhi Man Threatens To Kill Pm Modi To Go Back To Jail
PM Modi Threat Call ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తానని గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తిని శుక్రవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఖజూరీ ఖాస్ ప్రాంతానికి చెందిన సల్మాన్(22)అలియాస్ అర్మాన్‌గా గుర్తించారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సల్మాన్.. మళ్లీ జైలుకు వెళ్లాలనే కోరికతో ఈ ఫోన్ కాల్ చేసినట్లు తమతో చెప్పాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
2018లో ఓ హత్య కేసులో సల్మాన జువైనల్ కరెక్షన్ హోమ్‌లో ఉండి.. ఆ తర్వాత విడుదలయ్యాడని వెల్లడించారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన అతను మళ్లీ జైలుకు వెళ్లాలని భావించాడు. అయితే జైలుకు వెళ్లడం కోసం ఏకంగా ప్రధాని మోడీని చంపేస్తా అంటూ గురువారం అర్ధరాత్రి సమయంలో సల్మాన్ ఈ ఫోన్ చేశాడని పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ రాగానే వెంటనే అప్రమత్తమై.. ట్రేస్ చేశామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం ఖజూరీ ఖాస్ ప్రాంతానికి వెళ్లాల్సిందిగా జిల్లా పోలీసు విభాగానికి సమాచారమిచ్చామని చెప్పారు.
ప్రాథమిక దర్యాప్తులో.. ఫోన్ కాల్ చేసే సమయంలో సల్మాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని తెలిపారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. అంతకుముందు 10 గంటల ప్రాంతంలో తన తండ్రి అతడిని తిట్టాడని చెప్పారు. జైలుకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నావ్ అని ప్రశ్నించగా.. తనకు అక్కడ ఉండాలనిపిస్తోందని దర్యాప్తు సమయంలో సల్మాన్ చెప్పాడని సదరు సీనియర్ అధికారి వెల్లడించారు. ఇంటిలెజెన్స్ బ్యూరోతో కలిసి ఢిల్లీ పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.