Childrens suicide: మూడేళ్లల్లో 24 వేల మంది పిల్లలు ఆత్మహత్య : NCRB నివేదిక

నేటి బాలలే రేపటి పౌరులు. కానీ భావి భారత పౌరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న అత్యంత విషాదకర పరిస్థితులకు సంబంధించి నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (NCRB) వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్ల వ్యవధిలో 24వేల మంది టీనేజర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి.

NCRB data for Childrens suicide: నేటి బాలలే రేపటి పౌరులు. కానీ భావి భారత పౌరులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న అత్యత దారుణ పరిస్థితులకు సంబంధించి నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (NCRB) వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నేటి బాలలు బలన్మరణాలకు పాల్పడతుంటే రేపటి పౌరులు ఎలా తయారవుతారు. భారతావని పౌరుల బాల్యం చిన్ననాటే చిదిమేబడుతుంటే ఇక భవిష్యత్తు మాటేమిటి?అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో పిల్లలు ఆత్మహత్యల గణాంకాలు వింటే ఇదే ప్రశ్న వస్తుంది. మూడు సంవత్సరాల్లో ఏకంగా 24,000వేలమంది పిల్లలు (టీనేజర్లు) ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే షాక్ అవ్వాల్సిన దుస్థితి. దేశవ్యాప్తంగా గత మూడేళ్ల వ్యవధిలోనే అంటే 2017 నుంచి 2019 వరకు 24వేల మంది టీనేజర్లు అంటే 14-18ఏళ్ల వయస్సు కలవారు ఆత్మహత్యకు పాల్పడినట్లు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది.

పరీక్షల ఫలితాలు వచ్చాయంటే చాటు ఇంటర్ విద్యార్ధి లేక విద్యార్ధిని ఆత్మహత్య, లేదా 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య అనే వార్తలు వినిపిస్తుంటాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, తల్లిదండ్రులు తిట్టారనో, ఫోన్ ఇవ్వలేదని, టీవీ చూడలేదని,రిమోట్ ఇవ్వలేదనీ,గేములు ఆడొద్దన్నారనీ ఇలా పలు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారు ఎంతోమంది. ఇదే కారణాలతోనే కాకుండా ఇతర కారణాలతో కూడా దేశ వ్యాప్తంగా గత మూడేళ్ల వ్యవధిలోనే 24వేల మంది టీనేజర్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్‌సీఆర్‌బీ తాజాగా పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఈ ఆత్మహత్యల్లో ఎగ్జామ్స్ లో పాస్ కాలేదనే కారణంతో దాదాపు 4,046 మంది ఆత్యహత్య చేసుకున్నట్లుగా తెలిపింది. ఇవి లెక్కలోకి వచ్చినవే కావటం గమనించాల్సిన విషయం. ఇక లెక్కలోకి రాని ఆత్మహత్యలు ఎన్ని ఉంటాయో.

2017-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 24,568 మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో తెలిపింది. వారిలో 13,325 మంది (14-18 ఏళ్లు)బాలికలు ఉన్నారు. కేవలం 2017లోనే 8,029 మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. 2018లో 8162, 2019 సంవత్సరంలో 8,377 మంది ప్రాణాలు తీసుకున్నారని తెలిపింది. వీరిలో ఎక్కువ ఆత్మహత్యలు మధ్యప్రదేశ్‌లోనే జరిగాయి. 3,115 మంది టీనేజర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ తరువాతి స్థానంలో పశ్చిమబెంగాల్‌లో ఉంది. బెంగాల్లో 2,802 మంది చిన్నారులు, మహారాష్ట్రలో 2,527 మంది, తమిళనాడులో 2,035 మంది టీనేజర్లు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో నివేదికలో వెల్లడించింది.

మూడేళ్లలో చోటుచేసుకున్న మరణాల్లో పరీక్షల్లో తప్పడం, అలాగే ప్రేమ వ్యవహారాల వల్ల ఎక్కువమంది మరణించారని తెలిపింది. వివాహాలకు సంబంధించిన సమస్యలతో 639 మంది మృతి చెందగా.. వారిలో 411 మంది బాలికలున్నారు. 3315 మంది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కారణాలతో మరణించగా.. 2,567 మంది అనారోగ్యంతో ప్రాణాలు తీసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ఈ మరణాల్లో సన్నిహితులు మరణించడం, మద్యానికి బానిసగా మారడం, అక్రమ గర్భం, నిరుద్యోగం, పేదరికం,అలాగే లైంగిక వేధింపుల కూడా బలన్మరణాలకు కారణాలుగా ఉన్నాయి.

కౌమారదశలో ఉన్నపిల్లలకు మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఉంటాయని బాలల హక్కుల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కరోనా మహమ్మారి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు మరింత దిగజారుతున్నాయంటున్నారు. కాబట్టి చిన్నారులను నిరంతరం గమనిస్తుండాలని..వారికి భరోసాగా తల్లిదండ్రులు ఉండాలని..పిల్లల్లో మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై తల్లీదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పలు విషయాల్లో పిల్లలకు అవగాహన కల్పించాలని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు