AIMIM – Kamal Haasan MNM : వచ్చే ఏడాది ఆరంభంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీతో మజ్లిస్ దోస్తీ కట్టబోతుందా? అంటే.. కమల్ పార్టీతో మజ్లిస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం.
అదేగాని జరిగితే.. తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్‌తో కలిసి కమాల్ చేయగలదా? మజ్లిస్ పార్టీ తమిళనాడులో కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ అప్పుడే సమాధానం దొరకాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే.
ఇప్పటికే బిహార్ అసెంబ్లీ, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు వ్యూహాలను రచిస్తోంది. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయనున్నట్టు సమాచారం.
మక్క ల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమల్ హాసన్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ‘పొత్తు’ కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కమల్ పార్టీతో కలిసి మజ్లిస్ పోటీ చేయనున్నట్టు తెలిసింది.
తమిళనాడుకు చెందిన ఎంఐఎం నేతలతో అసద్ సోమవారం భేటీ అయినట్లు సమాచారం. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై అసద్ వారితో చర్చించినట్లు తెలిసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందో త్వరలోనే స్పష్టం చేస్తామంటున్నారు.
జనవరి చివరిలో ఒవైసీ చెన్నైలో పొత్తుకు తుది రూపం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాట 25 సీట్లలో పోటీ చేయాలని మజ్లిస్ భావిస్తున్నట్టు తెలిసింది.
అయితే ఇవే స్థానాల్లో కమల్‌తో పొత్తు పెట్టుకోనున్నట్టు సమాచారం. తమిళనాట మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు మజ్లిస్ రెడీ అవుతున్నట్టు సమాచారం.