Pahalgam Terrorist Attack
Pahalgam Terrorist Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యటకులే. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబుతాలాగా గుర్తించారు.
ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను స్కెచ్ వేశారు. వీరందరూ జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లో సభ్యులు. అయితే, ఈ ఉగ్రదాడికి ఇప్పటికే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఉగ్రవాదుల కోసం సైన్యం ఆపరేషన్ చేపట్టింది. ముష్కరులు బాడీ కెమెరాలతో దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీటిని హెల్మెంట్లకు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొలుత బాధితులు అందరినీ ఒకచోటుకు చేర్చి వారి గుర్తింపులను తనిఖీ చేశారు. ఆ తరువాత చంపేశారు. కొందరిని పారిపోతుండగా కాల్చేశారు.
పహల్గాంకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న బైసరన్ లోయలో ఈ దాడి జరిగింది. దాడి సమాచారం అందిన వెంటనే భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రదాడిలో గాయపడిన వారిలో కొందరిని అనంత్ నాగ్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఉగ్రదాడిలో ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారని వార్తలొచ్చాయి. ఇదికాకుండా ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి భద్రతా సంస్థలు ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్ లను విడుదల చేశారు.