Supreme Court
Supreme Court: పెగాసస్ స్పైవేర్ అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాలలో మంట పెడుతున్న సంగతి తెలిసిందే. పార్లెమెంటులో అధికార-ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం నడుస్తుండగానే అత్యున్నత న్యాయస్థానంలో ఈ అంశం విచారణకు వచ్చింది. ఈ అంశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగగా.. విచారణకు నిపుణుల కమిటీ వేసేందుకు అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కోర్టు సూచించిన వ్యక్తులతో స్వతంత్ర సభ్యుల నిపుణుల కమిటీ పెగాసస్ స్పైవేర్ అంశంపై దర్యాప్తు జరుపుతుందని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది.
పెగాసస్ స్పైవేర్ ఉపయోగించారా లేదా అన్న అంశంపై కేంద్రం తన అపిడవిట్లో స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించగా.. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్న కారణంగానే అదనపు అఫిడవిట్ దాఖలు చెయడానికి అంగీకరించడం లేదని సోలిసిటరీ జనరల్ తెలిపారు. పెగాసస్ ఉపయోగించలేదని కేంద్రం చెప్తే పిటిషనర్లు తమ పిటిషన్స్ ఉపసంహరించుకుంటారా అని సోలిసిటరీ జనరల్ ప్రశ్నించడంతో పాటు.. కేంద్రం చట్ట ప్రకారం వ్యవహరిస్తుందని కోర్టుకు సమాధానం ఇచ్చారు.
నిపుణుల కమిటీ ద్వారా వాస్తవాలు బయటపెట్టడానికి ప్రయత్నిస్తుందన్న సొలిసిటరీ జనరల్.. కమిటీ ఏ అంశంపై దర్యాప్తు చేయాలో కోర్టే నిర్ణయించాలని పేర్కొన్నారు. కాగా, పిటిషనర్ తరపు వాదనలు, సొలిసిటర్ జనరల్ సమాధానాలు విన్న సుప్రీమ్.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ అనిరుధా బోసే ధర్మాసనం ముందు సుదీర్ఘంగా విచారణ సాగగా.. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై వాదనలు వినిపించారు. పిటిషనర్లు తరఫున కపిల్ సిబాల్, శ్యాం దివాన్, ఎంల్ శర్మ, రాకేష్ ద్వివేది, మీనాక్ఖి అరోరా వాదనలు వినిపించారు.