Pegasus Row: సంచలనం రేపిన పెగాసస్ కేసులో నేడే సుప్రీంకోర్టు తీర్పు

దేశంలో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ(27 అక్టోబర్ 2021) తీర్పు ఇవ్వనుంది.

Supreme Court

Pegasus row: దేశంలో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ(27 అక్టోబర్ 2021) తీర్పు ఇవ్వనుంది. ఉదయం పదిన్నర గంటలకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ తీర్పు వెల్లడించనుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పెగాసస్ కేసును దర్యాప్తు చేయాలన్న పిటిషన్‌పై ధర్మాసనం తీర్పు ఇవ్వబోతుంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత పార్లమెంట్‌ సమావేశాలకు ఒక్కరోజు ముందు వెలుగుచూసిన పెగాసస్ స్పైవేర్ వ్యహహారం దేశంలో రాజకీయ మంటలు రేపింది. ప్రముఖులు, విపక్ష పార్టీల నేతలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టులతో సహా మొత్తం 300 మంది ఫోన్లు హ్యాక్‌కు గురయ్యాయంటూ వెలువడిన కథనాలు పెను దుమారం రేపాయి. దీంతో అధికార బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పెగాసస్‌పై గళం వినిపించాయి.

ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులపై ఉపయోగించాల్సిన నిఘా సాఫ్ట్‌వేర్‌ను రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సైంటిస్టులు, మానవ హక్కుల కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్‌కు ప్రభుత్వం ఉపయోగించిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పెగాసస్‌ను తాము దుర్వినియోగం చేయలేదని గత పార్లమెంట్‌ సమావేశాల్లోనే కేంద్రం ప్రకటన చేసినా.. విపక్షాలు ఆందోళన కొనసాగించాయి.

పెగాసస్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ.. గతంలో సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీరితో పాటు మరికొంతమంది కూడా పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వ్ చేసింది.