వైద్య సిబ్బందికి సంఘీభావం…చప్పట్లతో మార్మోగిన భారత్

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు.

అయితే రాత్రీపగలు తేడా లేకుండా,తమ ప్రాణాలు కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యంగా హాస్పిటల్స్ లో సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా సాయంత్రం 5గంటలకు ప్రతి ఒక్కరు తమ ఇళ్ల గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టాలని మోడీ తెలిపిన మేరకు ఇవాళ 5గంటలు అవగానే,దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టారు. కొన్ని చోట్ల ప్రజల తమ తమ అపార్ట్ మెంట్లలోని బాల్కనీలోకి వచ్చి,మరికొన్ని చోట్ల టెర్రస్ పైకి వచ్చి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టారు.

చప్పట్లతో దేశం మార్మోగిపోయింది. కొన్ని చోట్లా చప్పట్లతో పటు బెల్స్ కూడా మోగించారు. డ్రమ్స్ కూడా మోగించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మంత్రులు,అధికారులు కూడా తమ కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఆవరణలోకి వచ్చి చప్పట్లు కొట్టారు. తెలంగాణ సీఎం కూడా తన నివాసమైన ప్రగతిభవన్ ఆవరణలో అధికారులు,మంత్రులు,కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అధికారులు,మంత్రులతో కలిసి తాడేపల్లిలోని తన నివాసం గుమ్మం దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ పొడించబడింది.