WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ
మహారాష్ట్రలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే అంటే మేమే అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. కాగా, WE ARE 162 అంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి బల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలతో ఈ బల ప్రదర్శన చేశాయి. మూడు పార్టీలతో పాటు మిత్రపక్షాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. లాంగ్ లివ్ మహా వికాస్ అఘాడీ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే అని పీఎస్ యూ(పవార్-సోనియా-ధాక్రే) విశ్వాసం వ్యక్తం చేసింది.
ఈ బల ప్రదర్శనపై ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ శేలర్ తీవ్రంగా స్పందించారు. ”ఫొటో మీదే.. ఫినిషింగ్ మాత్రం మాది..” అంటూ ట్వీట్ చేశారాయన. 162మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నా.. నమ్మబుద్ధి కావడం లేదన్నారు. 145మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ లేరని అనుమానం వ్యక్తం చేశారు. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ బల ప్రదర్శనను పిల్లల ఆటతో పోల్చారు ఆశిష్ శేలర్.
బల ప్రదర్శనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆశిష్. ఇలాంటి పరేడ్ లు ప్రజాప్రతినిధులు చేయరని.. కేవలం క్రిమినల్స్ మాత్రమే చేస్తారని చెప్పారు. వారి తీరు ఓటర్లను అవమానించినట్టు ఉందన్నారు. ఫడ్నవిస్, అజిత్ పవార్ సర్కార్.. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో నెగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆశిష్. అంతేకాదు బల ప్రదర్శనలో ఉన్నది 162మంది కాదు 130 మంది మాత్రమే అని చెప్పారు.