Plastic Bag In Fish Stomach
plastic bag in fish stomach : ఓ వ్యక్తి చేపల మార్కెట్ కి వెళ్లాడు. అక్కడ చేపలను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి పట్టుకెళ్లేందుకు వాటిని కోయమని షాపు అతడికి చెప్పాడు. ఆ వ్యక్తి చేపను కోశాడు. అంతే, చేప కడుపులో ఉన్నది చూసి ఇద్దరూ షాక్ తిన్నారు. చేపను కోయగా దాని కడుపు నుంచి ప్లాస్టిక్ కవర్ బయటపడింది.
అత్తావర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేప కడుపులో ప్లాస్టిక్ కవరును చూసి ఆశ్చర్యపోయిన షాపు నిర్వాహకులు దాన్ని వీడియో తీశారు. చేప కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ ఉండటం ఒక షాక్ అయితే, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ చెక్కు చెదరకుండా ఉండటం మరింత విస్మయానికి గురి చేసింది.
చెరువులు, సముద్రాల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయటం వల్ల చేపలు ఇతర జలచరాలు.. వాటిని ఆహారంగా భావించి తినేస్తున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. దీని వల్ల చేపలకే కాకుండా.. వాటిని తినే మనుషులకు కూడా ప్రమాదమేనని వార్నింగ్ ఇస్తున్నారు. ప్లాస్టిక్ భూతం ఇప్పటికే మానవాళి పాలిట ముప్పుగా మారింది. మనిషి ఆరోగ్యంతో పాటు భూమికి, నీరుకి.. ప్లాస్టిక్ చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నింటిని కలుషితం చేస్తున్నాయి. ఇప్పటికైనా మనిషి మేలుకుని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.