Watch Viral Video: స్కూల్‌ బస్సులో వెళ్తూ ఆవేదన వ్యక్తం చేసిన బాలికలు.. ఎందుకంటే?

"ఉదయం స్కూల్‌కి చేరడానికి 20 నిమిషాలు పడుతుంది, కానీ, సాయంత్రం ఇంటికి చేరడానికి గంటా 30 నిమిషాల నుంచి 2 గంటలు పడుతుంది" అని ఆ బాలిక చెప్పింది.

Watch Viral Video: బెంగళూరులో రోడ్లు, మౌలిక సదుపాయాలపై మరోసారి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్కూల్ బస్సులో ఇంటికి వెళ్తూ ముగ్గురు విద్యార్థినులు వీడియో తీశారు. ఆ వీడియోలో నగరంలోని ప్రమాదకర రోడ్డులో బస్సు వెళ్తుండడాన్ని చూపించారు.

ఒక నిమిషం వ్యవధి ఉన్న ఈ వీడియోలో.. గుంతలతో నిండిన రోడ్లపై ప్రయాణం ఎంత నరకంగా ఉంటుందో ఆ చిన్నారులు చూపించారు. వీటి వల్ల స్కూలుకి, ఇంటికి వెళ్లడం ఆలస్యమవుతుందని, గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నామని వారు వివరించారు.

“చాలా సమయం బస్సులోనే గడుస్తోంది. ఇప్పుడే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాం. మా ఇల్లు స్కూల్‌కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం…” అని ఓ విద్యార్థిని చెబుతుండగా బస్సు ఓ గుంతలోకి దిగింది, కెమెరా అటూ ఇటూ కదిలింది. (Watch Viral Video)

“ఉదయం స్కూల్‌కి చేరడానికి 20 నిమిషాలు పడుతుంది, కానీ, సాయంత్రం ఇంటికి చేరడానికి గంటా 30 నిమిషాల నుంచి 2 గంటలు పడుతుంది” అని ఆ బాలిక చెప్పింది. ఇంట్లో చదువుకోడానికి సమయం అంతగా ఉండట్లేదని తెలిపింది.

దీంతో తాము ఒత్తిడికి గురవుతున్నామని, అలసటతో శక్తి పూర్తిగా తగ్గిపోతోందని ఆమె చెప్పింది. కొన్నిసార్లు ఈ గుంతల వల్ల శారీరక గాయాలు కూడా అవుతాయని వివరించింది. మార్పు రావాలని, దయచేసి తమకు సాయం చేయండని కోరింది.