పీఎం కేర్స్ ఫండ్ కు 5 రోజుల్లో 3వేల కోట్లు…దాతల పేర్లు ఎందుకు చెప్పలేదు

కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25లక్షలతో మొదలైన ఈ నిధికి మార్చి 31 నాటికి రూ.3075.8కోట్లు విరాళం సమకూరిందని… ఇందులో రూ.39.6కోట్లు విదేశీ నిధులు ఉన్నాయని మొదటి ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రారంభ విరాళం ఎవరిచ్చారన్నది నివేదికలో పేర్కొనకపోవడం గమనార్హం.

అయితే, పీఎం కేర్స్ ఫండ్‌కి ఐదు రోజుల్లోనే మూడు వేల పైచిలుకు కోట్ల రూపాయాలు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం… దాతల వివరాలు మాత్రం ఎందుకు వెల్లడించట్లేదని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం ప్రశ్నించారు. ఒక పరిమితిని దాటి విరాళాలు స్వీకరిస్తే ఏ ఎన్జీవో అయినా లేదా ట్రస్ట్ అయినా విరాళాలు వెల్లడించాల్సిందేనని… దీనికి పీఎం కేర్స్ ఫండ్ మాత్రం ఎందుకు మినహాయింపు అని ప్రశ్నించారు. దాతల పేర్లు వెల్లడించేందుకు ట్రస్ట్ సభ్యులు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

మరోవైపు, మోడీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. నేపథ్యంలో గతంలో మోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో చేసిన ఓ ట్వీట్‌ని చిదంబరం గుర్తు‌ చేశారు. ఇందుకు సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా చిదంబరం పోస్ట్ చేసి.. విమర్శలు గుప్పించారు.

2013లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలో చిక్కుకుందని, యువతకు ఉద్యోగాలు కావాలని మోడీ అన్నారు. సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని కోరుతూ మోడీ అప్పట్లో ట్వీట్ చేశారు. దానినే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది ఇదే అంటూ విమర్శలు గుప్పించారు.