అభినందన్ కు చిన్న గాయమైనా…వదిలిపెట్టనని పాక్ కు వార్నింగ్ ఇచ్చా

పాక్ లోని బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసిన తర్వాత ఆ దేశ సైన్యానికి చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ కు ఏదైనా జరిగితే తాను పాక్ ను వదిలిపెట్టబోమని హెచ్చరించినట్లు ప్రధాని మోడీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019)గుజరాత్ లోని పఠాన్ లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ….పాక్‌ యుద్ధ విమానాన్ని మనం కూల్చేశాం. మన పైలట్‌ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. మన పైలట్‌కు చిన్న గాయం అయినా గట్టిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని మోడీ తెలిపారు.
గుజరాత్‌ లో మరోసారి బీజేపీని 26 లోక్ సభ స్థానాల్లోనూ గెలిపించాలని మోడీ కోరారు.కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నారు. కానీ, గుజరాత్‌ లో 26 సీట్లను బీజేపీ గెల్చుకోకపోతే మే-23,2019న ఈ విషయంపై టీవీల్లో చర్చలు చేపడతారన్నారు. కంభమేళా సమయంలో ప్రయాగ్ రాజ్ లో తాను దళితుల కాళ్లు కడిగిన విషయం అమెరికా వార్తా పత్రికల్లోనూ వచ్చిందని తెలిపారు. మహాత్మాగాంధీ ఆలోచనలే తమ విధానాలుగా ఉన్నాయని మోడీ తెలిపారు.