Pm Modi Bengal Governor Waited 30 Mins For Cm Mamata
Cyclone Review Meet యాస్ తుఫాన్ ప్రభావంపై సమీక్షించేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా యాస్ తుపాను ప్రభావంపై మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే పశ్చిమ మెదినీపుర్ జిల్లా కలైకుండాలో నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్ కి ముందు హైడ్రామా నెలకొంది. సమావేశానికి..ముందుగా నిర్ణయించిన సమయానికి రాకుండా మోడీ,గవర్నర్ ని వెయిట్ చేయించారు సీఎం మమతా బెనర్జీ.
సీఎం మమతా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమారు 30 నిమిషాలు ఆలస్యంగా రివ్యూ మీటింగ్ కి వచ్చినట్లు సమాచారం. ఆలస్యంగా వచ్చిన తర్వాత కూడా.. ఎక్కువ సేపు మమత సమావేశంలో ఉండలేదు. కేవలం 15నిమిషాలు మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు దీదీ. తుఫాన్ వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను ప్రధాని అందించి..తనకు వేరే మీటింగ్ లు ఉన్నాయంటూ వెంటనే రివ్యూ మీటింగ్ నుంచి మమత వెళ్లిపోయారు.
అయితే, అనంతరం దిఘాలో మీడియాతో మాట్లాడిన దీదీ..ఇతర సమావేశాలు ఉండటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. తాను మీటింగ్ లో ప్రధానితో.. మీరు నన్ను కలవడానికి చాలా దూరం వచ్చారు.. మీరు నన్ను కలవాలని అనుకున్నారు.. కాబట్టి నేను వచ్చాను.. నా ప్రధాన కార్యదర్శి మరియు నేను ఈ నివేదికను మీకు సమర్పిస్తున్నాము. నేను ఇప్పుడు నా షెడ్యూల్ ప్రకారం దిఘా వెళ్ళాలి. రాష్ట్ర అధికారులు నన్ను కలవాలనుకుంటున్నారు కాబట్టి నేను మీ సెలవు తీసుకుంటున్నాను అని చెప్పినట్లు సీఎం మమత తెలిపారు. దిఘాలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించేందుకే తాను ప్రధానితో సమావేశం నుంచితొందరగా వచ్చినట్లు సీఎం తెలిపారు. దీఘా అభివృద్ధికి రూ.20వేల కోట్లు, సుందర్బాన్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు మమత చెప్పారు. శనివారం తాను యాస్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నట్లు మమత తెలిపారు.
ఇక,మమత ఆలస్యంగా రావడం మరియు సమావేశం నుంచి వెంటనే వెళ్లిపోవడంపై బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం మరియు అధికారులు పాల్గొనకపోవడం రాజ్యాంగబద్ధత లేదా చట్ట నియమాలతో సమకాలీకరించబడలేదని మమత తీరుని ఖండించారు గవర్నర్. ఘర్షణ వైఖరి.. రాష్ట్ర లేదా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు హానికరం చేస్తుందన్నారు.