Pm Modi (2)
PM Modi అప్ఘానిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఆ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) ఇవాళ సమావేశమైంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అప్ఘాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి సేఫ్ గా తీసుకురావడం మరియు అప్ఘానిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తాలిబన్ల పట్ట అనుసరించాల్సిన వైఖరి వంటి అనేక విషయాలు ఈ భేటీలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కాగా,తాలిబన్ల ప్రవర్తన, ప్రభుత్వం ఏర్పాటు వంటి అంశాలను నిశితంగా పరిశీలించాలని భారత్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది కూడా కీలకమేనన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా,ఇస్లామిక్ ఉగ్రవాదానికి అఫ్గానిస్థాన్ కేంద్రబిందువుగా మారే ప్రమాదం ఉన్నట్టు భారత్ భావిస్తోందని.. ఈ విషయాన్ని అఫ్గాన్ వ్యవహారాలతో సంబంధం ఉన్న కొందరు అధికారులు మీడియాకు తెలిపారు. అమెరికా విడిచిపెట్టి వెళ్లిన ఆయుధాలతో పాటు అప్పటివరకు అఫ్గాన్ సైనికుల వద్ద ఉన్న తుపాకులతో ఇప్పుడు తాలిబన్లు మరింత శక్తిమంతంగా మారే అవకాశముందని భారత్ అభిప్రాయపడుతోందన్నారు. లష్కరే తోయిబా, లష్కరే ఝాంగ్వి వంటి పాక్ ఆధారిత ఉగ్ర సంస్థల ఉనికి అప్ఘానిస్తాన్ లో ఉందన్నారు. కాబుల్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇతర గ్రామాల్లో చెక్‌పోస్టులను ఈ ఉగ్రసంస్థలు ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. ఇది భద్రతాపరంగా ఆందోళనకర విషయమని తెలిపారు.