Modi కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2021)ఉదయం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2021-22 ను “సబ్ కా బడ్జెట్” గా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. సంక్షోభ పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదని..అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు. ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్ అని పేర్కొన్న ఆయన ఈ బడ్జెట్ భారత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అండ్ టీమ్‌ను ప్రధాని అభినందించారు.
బడ్జెట్ వృద్ధికి ఊతమిస్తోందని.. యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. యువత ఉపాధి కోసం మౌలిక వసతుల కల్పన సదుపాయాలు పెంచుతామని చెప్పారు. అయితే బడ్జెట్ చూసి చాలా మంది నిపుణులు సామాన్యులపై భారం మోపారని కామెంట్ చేశారని మోడీ తెలిపారు. కానీ దీనిని మోడీ ఖండించారు. ఆదాయం, వెల్ నెస్ మరింత పెరుగుతోందని చెప్పారు. అన్నీ రంగాల్లో దేశం అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. రైతుల ఆదాయం పెంచేందుకు చక్కగా ప్రణాళికలు రచించారని మోడీ కొనియాడారు.
గ్రామీణ భారతం, రైతుల హృదయం నుంచి ఈ బడ్జెట్ పుట్టుకొచ్చిందని మోడీ అభివర్ణించారు. కాగా, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. రైతుల ప్రయోజనాల కోసం మోడీ సర్కార్ కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని.. పంటకు 1.5 శాతం ఎక్కువ ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీనిచ్చారు. వ్యవసాయ రుణాలను గణనీయంగా పెంచుతామని హామీనిచ్చారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచుతున్నామని తెలిపారు.