PM Modi Launches IRIS : ఆ ద్వీపాలకు అండగా “ఐరిస్” ఆవిష్కరించిన మోదీ..భారత నాయకత్వంపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు

ఇంగ్లాండ్ లోని గాస్గోలో రెండవ రోజు జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు ( కాప్ 26)లో మంగళవారం ప్రధాని మోదీ పాల్గొన్నారు.

PM Modi Launches IRIS      ఇంగ్లాండ్ లోని గాస్గోలో రెండవ రోజు జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు ( కాప్ 26)లో మంగళవారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​​ సహా పలువురు ప్రపంచ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న ద్వీపాల్లో మౌలికవసతులు పెంపొందించేందుకు ఉద్దేశించిన ఐరిస్​(ఇన్ఫ్రాస్ట్రక్చర్​ ఫర్​ రిసీలియంట్​ ఐలాండ్​ స్టేట్స్-IRIS​)ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వాతావరణ మార్పుతో ఆయా దేశాలు ప్రమాదంలో పడ్డాయని, అక్కడి ప్రజల్లో ఐరిస్​ కొత్త ఆశలు, నమ్మకాన్ని నింపుతుందని మోదీ అన్నారు.

కాప్ 26 వాతావరణ సదస్సులో మోదీ మాట్లాడుతూ..వాతావరణ మార్పుతో అత్యంత దారుణంగా దెబ్బతిన్న దేశాలకు సాయం చేసేందుకు ఐరిస్​ ఉపయోగపడుతుంది. వాస్తవానికి వాతావరణ మార్పులతో గత దశాబ్ద కాలంగా ప్రతి ఒక్కరు ప్రభావితమవుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, సహజసిద్ధ వనరులున్న దేశాలు కూడా ముప్పు బారినపడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది మనం అందరం చేసుకున్నదే. కాబట్టి మానవజాతి మనుగడకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరముంది. చిన్న ద్వీపాలపై వాతావరణ మార్పు ప్రభావం దారుణంగా ఉంది. ప్రకృతి విపత్తులకు సంబంధించిన డేటాను ఆయా ద్వీపాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పంచుకుంటుంది. భారత్ అన్ని రకాల ఈ ద్వీపాలను ఆదుకుంటుందని మోదీ అన్నారు.

మరోవైపు, కాప్​ 26 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ భేటీ అయ్యారు. తీవ్రవాద, వేర్పాటువాద శక్తుల నిర్మూలన కార్యాచరణ సహా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత వ్యతిరేక తీవ్రవాద, వేర్పాటువాద శక్తులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​ అన్నట్లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష వర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. వాతావరణ మార్పుపై భారత్​ నాయకత్వాన్ని బోరిస్ ప్రశంసించినట్లు తెలిపారు.

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిధుల సమీకరణ (క్లైమేట్‌ ఫైనాన్స్‌), పునరుత్పాదక ఇంధనాలు, సౌరశక్తి వంటి సంయుక్త కార్యక్రమాలపై బ్రిటన్‌తో కలిసి పనిచేస్తామని మోదీ చెప్పారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు విజయ్​ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే అంశాన్ని బోరిస్ తో మోదీ ప్రస్తావించారు. ఎంతో కీలకమైన ఈ అంశంపై ఇరు దేశాల భద్రత సలహాదారులు నవంబరు 3న ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

ALSO READ UPI Transactions : దేశంలో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు

ట్రెండింగ్ వార్తలు