PM Modi meeting with ministers farmers problems : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం రెండుసార్లు చర్చలు జరిపినా విఫలం కావటంతో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులతో సమావేశమయ్యారు. హోమ్ మంత్రి అమిత్ షా, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు.
గత కొన్నిరోజులుగా రైతులు చేపడుతున్న నిరసనలకు ముగింపు పలకాలని ప్రధాని భావిస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల అభ్యంతరాలు, రైతుల సమస్యలపై చర్చలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం చేపట్టగా..వ్యవసాయం చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రైతులకు భరోసా కల్పించేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చి రైతుల ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది.
దీంట్లో భాగంగా వ్యవసాయ చట్టాల్లో మార్పులుచేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రైతులకు భరోసా కల్పించేలా కొన్ని చర్యలకు ప్రతిపాదనలతో మంత్రులు ప్రధానితో భేటీ అయ్యారు. విద్యుత్ బిల్లులపై రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని..రైతులు పండించే పంటలకు మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కేంద్రం యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా, కేంద్రం ఇప్పటికే రెండు దఫాలుగా రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపినా సయోధ్య కుదరలేదు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అవగాహన కల్పించి, వారిలో నెలకొన్న అపోహలను తొలగించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు చర్చలు ఏమాత్రం ఉపకరించలేదు.
ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలను రైతులు ఏమాత్రం అంగీకరించకపోవడంతో ఢిల్లీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యాహ్నం మరోసారి ఇరువర్గాల మధ్య సమావేశం జరగనుంది. వీటితో పాటు పలు కీలకనిర్ణయాలకు సంబంధించి ప్రధానితో కేంద్రమంత్రులు చర్చించారు.