నా ఊపిరి ఉన్నంత వరకు అలా జరగనివ్వను: ప్రధాని మోదీ

Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇతర వెనుకబడిన తరగతుల ప్రజలు అప్రమత్తం ఉండాలని మోదీ చెప్పారు.

ఇండియా కూటమికి చెందిన నేతలు ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఝార్ఖండ్‌లోని దుమ్కాలో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ… ఇండియా కూటమి వారికి తాను ఒకటి చెప్పదలుచుకున్నానని అన్నారు.

తన ఊపిరి ఉన్నంత వరకు గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల వారి రిజర్వేషన్‌లను ఇండియా కూటమి నేతలు లాక్కొని ముస్లింలకు, ‘ఓటు జిహాద్’ చేసే వారికి ఆ రిజర్వేషన్లు ఇవ్వనివ్వనని మోదీ అన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలతో కొత్త శకం ప్రారంభమవుతుందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇతర వెనుకబడిన తరగతుల ప్రజలు అప్రమత్తం ఉండాలని మోదీ చెప్పారు. వెనుకబడిన వర్గాల వారిని చీకటిలో ఉంచడం ద్వారా ప్రతిపక్షాలు వారిని దోచుకుంటున్నాయని తెలిపారు. దళితులు, ఆదివాసీల శ్రేయోభిలాషులుగా చెప్పుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని మోదీ తెలిపారు. ఓటు బ్యాంకు కోసం రాబోయే తరాలను కూడా నాశనం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. తాను తన ఓబీసీ, దళిత, గిరిజనుల హక్కుల కోసం పోరాడతానని తెలిపారు. ప్రతిపక్షాల పాపానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతున్నానని, అందుకే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విపక్షాలు న్యాయవ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు. ఎవరు జైలుకు వెళ్లాలో ప్రధాని మోదీయే నిర్ణయిస్తారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై మోదీ స్పందిస్తూ తనపై ఆరోపణలు చేసేవారు రాజ్యాంగాన్ని చదివితే బాగుంటుందని అన్నారు. తాను ఎవరికీ ఏమీ చెప్పనవసరం లేదని తెలిపారు.

Also Read: ప్రశాంత్ కిశోర్ కాదు.. అశాంతి కిశోర్: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్

ట్రెండింగ్ వార్తలు