దేశ ఐక్యతను దెబ్బ తీసేందుకు కొందరు విష బీజాలు నాటారు: మోదీ

దేశంలో అప్పట్లో విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్‌కు ఓ మచ్చ అని, దాన్ని ఎప్పటికీ కడిగేసుకోలేరని చెప్పారు.

రాజ్యాంగ నిర్మాతలు భిన్నత్వంలో ఏకత్వ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నారని, అయితే కొంతమంది మాత్రం అలా ఉండకూడదని భావిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఐక్యతను దెబ్బ తీసేందుకు కొందరు విష బీజాలు నాటారని చెప్పారు.

మోదీ ఇవాళ ఆయన లోక్‌సభలో ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చలో మోదీ మాట్లాడారు. దేశంలో అప్పట్లో విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్‌కు ఓ మచ్చ అని, దాన్ని ఎప్పటికీ కడిగేసుకోలేరని చెప్పారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొందరు స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డామని ప్రధాని మోదీ తెలిపారు. బానిస మనస్తత్వంతో ఉన్న వారు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించారని చెప్పారు. పేదలకు ఇబ్బంది లేకుండా తాము వన్‌ నేషన్ వన్‌ కార్డ్ తీసుకొచ్చామని అన్నారు. డిజిటల్ ఇండియా దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

రాజ్యాంగాన్ని రూపొందించడంలో మహిళలు, బీఆర్ అంబేద్కర్, పురుషోత్తం దాస్ టాండన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖుల కృషిని మోదీ గుర్తుచేసుకున్నారు. మహిళలకు వారి హక్కులను కల్పించడానికి అనేక దేశాలకు దశాబ్దాలు పట్టిందని, అయితే భారత రాజ్యాంగం వారికి మొదటి నుంచి ఓటు హక్కును కల్పించిందని అన్నారు.

మహిళ చనిపోతే అరెస్ట్ చేయొద్దా?: అల్లు అర్జున్ అరెస్టుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కామెంట్స్‌