షహీన్‌బాగ్ సహా దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకుపైగా జరుగుతున్న సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీ వ్యతిరేక అల్లర్ల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయడమే నిరసనల వెనుక ప్రధాన ఉద్దేశమని మోడీ తెలిపారు. ఈ తరుణంలో దేశానికి సరైన దిశానిర్దేశం చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. అభివృద్ధి రాజకీయాలకే ప్రజలు పట్టం కట్టాలని కోరారు.
సీలంపూర్ కానీయండి, జామియా, షహీన్ బాగ్ కానీయండి. కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఇవి కాకతాళీయంగా జరుగుతున్న నిరసనలు కాదు.ఇది ఒక ఎక్స్‌పర్‌మెంట్ అని ప్రధాని అన్నారు. జామియా, షాహీన్‌బాగ్ తదితర నిరసనల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని, ఇండియాను విడగొట్టే కుట్ర ఉందని ఆరోపించారు.నిరసనలతో దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారని అన్నారు.
ఢిల్లీలోని ద్వారక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రద్యుమ్న రాజ్‌పుత్ తరఫున మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ…ఈ దశాబ్దంలోనే మొదటిదైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకమని, ఇవాళ తీసుకున్న నిర్ణయంపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉందన్నారు. ఈ బహిరంగ సభలో మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటం, బీజేపీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో కొందరికి నిద్ర కూడా పట్టడం లేదని మోదీ విపక్షాలను ఉద్దేశించి అన్నారు. సోమవారంనాడు ఈస్ట్ ఢిల్లీలోనూ, మంగళవారం ద్వారకలోనూ ప్రజల స్పందనను బట్టి ఫిబ్రవరి 11న వెలువడే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చాలా స్పష్టంగా తేలిపోయిందని మోడీ బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.