ఈబీసీ రిజర్వేషన్లు : రాజకీయ లబ్ది కోసమేనా

  • Publish Date - January 7, 2019 / 11:29 AM IST

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మోదీ ప్రభుత్వం నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఎన్నికల స్టంట్ అని, రాజకీయ లబ్ది కోసమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న విశ్లేషణలు వస్తుండటంతో ఈ రిజర్వేషన్ వ్యవహారాన్ని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిందని చెబుతున్నాయి. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు తర్వాత బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ, మైనార్టీ రిజర్వేషన్ల కోటా పెంచాలని ఇప్పటికే తెలంగాణ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో పెట్టాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యమని అటు మోదీ ఇటు అమిత్ షా పదే పదే చెబుతూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈబీసీ కోటాను కేంద్రం తెరమీదకు తెచ్చింది. తద్వారా మిగిలిన రిజర్వేషన్ల తేనె తుట్టును కదిపి రాజకీయ లబ్దిని పొందాలి అనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లకు అందరూ ఆమోదం తెలిపితే ఆ ఘనత తన ఖాతాలో పడుతుందన్నది బీజేపీ వ్యూహం. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

రిజర్వేషన్లు 50శాతం మించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పుతో.. దేశంలో ప్రస్తుతం 49.5శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. ఇందులో ఎస్సీ 15శాతం, ఎస్టీ 7.5శాతం, ఓబీసీ 27శాతంగా ఉంది. అయితే కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న ఈబీసీ 10శాతం రిజర్వేషన్‌తో ఈ మొత్తం 59.5శాతంకు పెరుగుతుంది. ఈ పెంపుతో ఎవరి కోటాలో ఎలాంటి మార్పు లేకున్నా, విద్య, ఉద్యోగ అవకాశాల్లో పోటీ పరంగా అదనపు వ్యక్తులు వచ్చి చేరతారు.

 

ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్ల శాతం 49.5
ఎస్సీ-15 శాతం
ఎస్టీ-7.5 శాతం
ఓబీసీ-27శాతం
10శాతం పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 59.5శాతం