కరోనా ఎఫెక్ట్ : ఢిల్లీలో తగ్గిన కాలుష్యం..స్వచ్చమైన గాలి

  • Publish Date - March 30, 2020 / 11:24 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలు తోడేసింది. లక్షల సంఖ్యల్లో వైరస్ బారిన పడిన వారు ఉన్నారు. ఇంకా పలు దేశాల్లో విజృంభిస్తోంది. ఈ వైరస్ కు మందు లేకపోవడంతో ఏమీ చేయాలో తెలియక జట్టు పీక్కున్నారు. ఒకరి ద్వారా మరొకరికి సోకకుండా ఉండాలంటే..ప్రజలు బయట తిరగకుండా ఉంటే మంచిదని భావించి లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు రోడ్డెక్కడం లేదు (అత్యవసరం మినహా). నిత్యం వినిపించే రణగణ ధ్వనులు వినిపించడం లేదు. ఎక్కడికక్కడ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీనివల్ల కొంత మేలు జరిగిందంటున్నారు. 

అసలు విషయం ఏమిటంటే..
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. స్వచ్చమైన గాలి పీల్చాలంటే సాధ్యమయ్యేది కాదు. వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అయిపోయే వారు. ప్రపంచంలోనే వాయు కాలుష్యం అధికంగా ఉన్న జాబితాల్లో భారత్ టాప్ పొజిషన్ లో ఉంది. ప్రధాన నగరాల్లో పొల్యూషన్ అధికంగా ఉంది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు కాలుష్యం కారణంగా అనారోగ్యనికి గురయ్యే వారు. 

కానీ కరోనా పుణ్యమా అని తగ్గిపోయింది. ఢిల్లీలో శనివారానికి సుమారు 40 కేసులు నమోదు కావడం..లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేసింది ప్రభుత్వం. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్ భారీగా తగ్గినట్టు SAFAR సంస్థకు చెందిన ఓ సైంటిస్టు వెల్లడించారు. సర్వసాధారణంగా మార్చి నెలలో గాలిలో నాణ్యత సూచి మధ్యస్తంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది.

వాయు నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెయ్యి వరకు ఉండేదని, కానీ కరోనా వల్ల ఇది ఏకంగా 129కి పడిపోయిందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. ఢిల్లీలో వీస్తున్న గాలి చాలా స్వచ్చంగా ఉందని తెలిపారు. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఢిల్లీలో పరిశ్రమలు మూతపడడం, వాహనాలు రొడ్కెక్కకపోవడమే కారణమంటున్నారు.