Congress- Phonepe: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై పోస్టర్లు.. కాంగ్రెస్‌ పార్టీని హెచ్చరించిన ఫోన్‌పే

కాంగ్రెస్ పార్టీకి డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే హెచ్చరికలు చేసింది. మా అనుమతి లేకుండా మా బ్రాండ్‌ను ఎలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది.

PhonePe Warns Congress

PhonePe Warns Congress: కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe) తీవ్ర హెచ్చరికలు చేసింది. మా అనుమతి లేకుండా మా బ్రాండ్‌ను ఎలా వినియోగిస్తారంటూ ప్రశ్నించింది. ఈ హెచ్చరికలకు కారణం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ వ్యవహారమే. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పలు ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వంలో అవినీతి తారాస్థాయికి చేరిందంటూ కాంగ్రెస్ పోస్టర్ వార్‌ను ప్రారంభించింది. బీజేపీసైతం పోస్టర్ వార్‌తో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ పోస్టర్ వార్‌ను మొదలు పెట్టింది.

Telangana Congress: ఇక సమరమే.. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తూ ముందుకు..

భోపాల్‌లో కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్‌పై ‘వాంటెడ్ కరప్షన్ నాథ్’ అని రాసి ఉన్న పోస్టర్లు కనిపించాయి. ఈ పోస్టర్లు బీజేపీ పనేనని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మాత్రం.. ఆ పోస్టర్లలో మా ప్రమేయం లేదని, కాంగ్రెస్‌లోని అంతర్గత పోరు ఫలితమేనని మధ్యప్రదేశ్ బీజేపీ పేర్కొంది. ఈ ఘటన తరువాత.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అవినీతికి పాల్పడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. చౌహాన్‌కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లో పోస్టర్లు వెలిశాయి. 50శాతం కమిషన్లు తీసుకుంటున్నట్లు చౌహాన్‌పై ఆరోపణలు చేస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి. డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే లోగోతో కూడి క్యూఆర్ స్కార్‌పై సీఎం చౌహాన్ బొమ్మను ఆ పోస్టర్లలో ముద్రించి ఉంది. అయితే, పోస్టర్లలో PhonePe బ్రాండ్ పేరు, లోగో కూడా ఉన్నాయి. ఈ పోస్టర్లతో కూడిన చిత్రాలను రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. 50శాతం పొందండి, ఫోన్‌లో పనిపూర్తి చేయండి అంటూ.. మధ్యప్రదేశ్ ప్రజలకు తెలుసు.. 50శాతం కమీషన్ తీసుకునే వారిని వారు గుర్తిస్తారు అని హిందీలో ట్వీట్ చేసింది.

Madhya Pradesh Congress and BJP War

ప్రచారంలో తమ అనుమతి లేకుండా PhonePe లోగోను వాడుకోవటంపై ఆ సంస్థ స్పందించింది. ట్విటర్ వేధికగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు చేసింది. తమ బ్రాండ్ లోగోను అనుమతి లేకుండా మూడవ వ్యక్తి వాడుకోవటం సరికాదు అని ఫోన్ పే తెలిపింది. రాజకీయాలకైనా, రాజకీయేతర విషయాలకు కూడా లోగోను ఇలా వాడవద్దు అని తన ట్వీట్ లో చెప్పింది. అనుమతి లేకుండా లోగోను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫోన్ పే కంపెనీ తెలిపింది. అయితే, ఫోన్ పే ట్వీట్ పై కాంగ్రెస్ స్పందించలేదు.