పీకే ను పార్టీ నుంచి తొలగించిన నితీష్ కుమార్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం సీట్లు తమకు కేటాయిస్తేనే బీజేపీతో పొత్తు లేకుంటే లేదు అన్నట్లు ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. సీఏఏ,ఎన్ఆర్సీ వంటి విషయాల్లో మిత్రపక్షం బీజేపీపైనే యుద్ధానికి దిగుతుండటం,కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ వైఖరిపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన 24గంటల్లోనే పార్టీ నుంచి ప్రశాంత్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు నితీష్ కుమార్.

ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉంటే ఓకే…వెళ్లిపోయినా కూడా ఓకే అని,జేడీయూ పార్టీలోనే ప్రశాంత్ కిషోర్ ఉండాలనుకుంటే పార్టీ అతను పార్టీ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని అవలంబించాల్సి ఉంటుందని,అప్పట్లో అమిత్ షా చెబితేనే పార్టీలో ప్రశాంత్ కిషోర్ ను చేర్చుకున్నామని మంగళవారం నితీష్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నితీష్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే ప్రశాంత్‌ కిషోర్‌ కూడా తీవ్రంగా స్పందించారు. తనను ఎందుకు పార్టీలోకి చేర్చుకున్నారనే విషయంలో ఎంతో దిగజారి నితీశ్‌ అబద్దం చెప్తున్నారని మండిపడ్డారు.

ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చిన 24గంటల్లోనే ప్రశాంత్ కిషోర్ ను పార్టీ నుంచి తొలగించారు నితీష్ కుమార్. తనను పార్టీ నుంచి తొలగించడంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. నితీష్ కుమార్ కు ధన్యవాదాలు చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి కుర్చీని నిలుపుకోవాలని నా శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ సీఎం అయ్యేందుకు ప్రశాంత్ వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్ అప్పటినుంచి ఆ పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ నెంబర్.2గా కొనసాగారు. ఇటీవల సీఏఏ బిల్లుకు పార్లమెంట్ లో జేడీయూ మద్దుతు తెలపడాన్ని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. గతేడాది డిసెంబర్ లోనే పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్తాడని ప్రచారం జరిగింది. అయితే నితీష్ కుమార్ బుజ్జగింపులతో ఆయన పార్టీలో కొనసాగినట్లు అప్పట్లో బీహార్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.

మరోవైపు ప్రశాంత్ కిషోర్ తో పాటు ఆ పార్టీలోని  మరో ముఖ్యనాయకుడు పవన్ వర్మను కూడా పార్టీ నుంచి తొలగించారు నితీష్ కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ పొత్తును విమర్శించిన పవన్ వర్మ తీరును ఇటీవల నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. తనతో వ్యక్తిగత సంభాషణలను బాహాటంగా వెల్లడించిన పవన్‌కు తన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తూ, ఆయన పార్టీ మారాలనుకుంటే, వెళ్ళిపోవచ్చునని ఆ సమయంలో వ్యాఖ్యానించిన నితీష్ ఇవాళ ప్రశాంత్ కిషోర్ తో పాటు ఆయనను కూడా పార్టీ నుంచి తొలగించారు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.. వెస్ట్ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహకర్తగా పనిచేసేందుకు ఇప్పటికే అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే.