Prashant Kishore satires on Rahul Gandhi Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: 18వ లోక్సభ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని నిలుపడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సెటైర్లు గుప్పించారు. దాడి ఒకవైపు జరిగితే మరొకవైపు సైన్యాన్ని పంపినట్లు రాహుల్ యాత్ర కొనసాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ బలంగా ఉన్న చోట యాత్ర చేపడితే బాగుంటుందని ఈ సందర్భంగా పీకే సూచించారు.
రాహుల్ యాత్రపై శనివారం ఆయన స్పందిస్తూ ‘‘తూర్పున దాడి జరిగితే పశ్చిమానికి సైన్యాన్ని పంపినట్లు.. భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉన్నచోట రాహుల్ పాదయాత్ర చేయడం ఏంటి? బీజేపీ బలంగా ఉన్న చోటుకి కదా రాహుల్ వెళ్లాలి, అక్కడ కదా యాత్ర చేయాలి. కానీ ఇదేం లాజిక్? బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతంలో రాహుల్ తిరగడం వల్ల బీజేపీ ఎలా బలహీనపడుతుంది? అక్కడ కాంగ్రెస్ ఎలా పుంజుకుంటుంది?’’ అని పీకే ప్రశ్నించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన యాత్రలో మెజారిటీ శాతం బీజేపీయేతర ప్రాంతాలే ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలు మినహా.. రాహుల్ పర్యటించే ఏ ప్రాంతంలో బీజేపీ అధికారంలో లేదు. పైగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ పర్యటన సమయం తక్కువగానే ఉంది. బీజేపీ బలంగా ఉండే గుజరాత్, యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలను రాహుల్ పర్యటనలో లేనేలేవు. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి.