Bharat Jodo Yatra: వివాదాస్పద పాస్టర్‭ను కలుసుకున్న రాహుల్.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోన్న బీజేపీ

బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. తమకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ధ్వేషం లేదని, దేశంలోని అందరి గురించి ఆలోచిస్తామని, అందరినీ కలుస్తామని కౌంటర్ ఇస్తున్నారు. ‘గోలి మారో’ అంటూ విధ్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్‭ని కూడా తాము కలిసామని, అతడితో మాట్లాడామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు

Bharat Jodo Yatra: వివాదాస్పద పాస్టర్‭ను కలుసుకున్న రాహుల్.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోన్న బీజేపీ

Rahul meets george ponnaiah who was arrested for anti hindu remarks

Bharat Jodo Yatra: భారత్ జోడో అంటూ దేశాన్ని ఏకం చేసే యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ పర్యటనపై భారతీయ జనతా పార్టీ రోజుకో విధంగా దాడికి దిగుతోంది. శుక్రవారం రాహుల్ వేసుకున్న టీ-షర్ట్ ఖరీదును ప్రస్తావిస్తూ వివాదాస్పదం చేసిన కాషాయ పార్టీ.. తాజాగా తమిళనాడుకు చెందిన జార్జ్ పొన్నయ్య అనే పాస్టర్‭ను రాహుల్ కలుసుకోవడంపై తీవ్రంగా మండిపడుతోంది. గతంలో సదరు పాస్టర్ మోదీ, అమిత్ షాల మీద విమర్శలు చేశారు. ఆ సందర్భంలో ఆయనపై పలు కేసులు సైతం నమోదు అయ్యాయి.

కాగా, తాజా కలయికలో హిందుత్వానికి వ్యతిరేకంగా సదరు పాస్టర్ వ్యాఖ్యానించారని, ఆ సమయంలో రాహుల్ కలిసే ఉన్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి షేజాద్ పూనావాలా తన ట్విట్టర్ ఖాతాలో రాహుల్, పొన్నయ్య సమావేశమైన వీడియోను షేర్ చేస్తూ ‘‘జార్జ్ పొన్నయ్యను రాహుల్ కలుసుకున్నారు. పొన్నయ్య హిందూ దేవతలను అవమానిస్తూ మాట్లాడారు. దేవుళ్లందరిలో జీసెస్ మాత్రమే నిజమైన దేవుడని ఆయన అన్నారు. ఇతడు గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భారత మాత మలినాలు అంటకుండా తాను బూట్లు ధరిస్తానని పొన్నయ్య అన్నాడు. ఇలాంటి వ్యక్తిని రాహుల్ కలవడమేంటి? ఇది భారత్ జోడో యాత్రనా? భారత్ తోడో యాత్రనా?’’ అని ట్వీట్ చేశారు.

ఇక బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ ‘‘రాహుల్ గాంధీ యాత్రకు ఇది నాలుగోరోజు. ఎన్నికలకు ముందు వరుస పెట్టి దేవాలయాను సందర్శించే వ్యక్తిని తాజా ప్రయాణంలో ఒక్క హిందూ దేవాలయాన్ని కానీ, సంస్థను కానీ సందర్శించలేదు. కానీ వివాదాస్పద హిందూ ధ్వేషపూరిత వ్యక్తుల్ని మాత్రం తరుచూ కలుస్తూనే ఉంటారు. రాహుల్ గాంధీ ఆలోచనల్లో హిందువులకు స్థానమే లేదా?’’ అని ట్వీట్ చేశారు.

బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. తమకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ధ్వేషం లేదని, దేశంలోని అందరి గురించి ఆలోచిస్తామని, అందరినీ కలుస్తామని కౌంటర్ ఇస్తున్నారు. ‘గోలి మారో’ అంటూ విధ్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్‭ని కూడా తాము కలిసామని, అతడితో మాట్లాడామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. వీడియోలో ఉన్నది ఒకటైతే దానికి వక్రభాష్యాలు పూసి బీజేపీ ప్రచారం చేస్తోందని, అయినా బీజేపీ ఫేక్ ఫ్యాక్టరీలో ఇలాంటివి తయారు కావడంపై ఆశ్చర్యం ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తిప్పికొట్టారు.

ఎవరీ జార్జ్ పొన్నయ్య?
ఈయన రోమన్ క్యాథలిక్ చర్జ్ పాస్టర్. హిందూ మత విశ్వాసాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 2021లో పొన్నయ్యాను అరెస్టు చేశారు. జూలై 18, 2021న జరిగిన ఒక కార్యక్రమంలో పొన్నయ్య మాట్లాడుతూ క్రిస్టియన్, ముస్లిం ఓటర్లకు తాను చేసిన సూచనల వల్లే తమిళనాడులో డీఎంకే గెలిచిందని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలపై కూడా ఆయన విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా పలు కేసులు నమోదు అయ్యాయి.

Rahul Gandhi T-Shirt : Rs.41వేల కాస్ట్లీ టీషర్టు వేసుకుని పాదయాత్ర అంటూ బీజేపీ విమర్శలు .. మోడీ ధరించిన రూ.10లక్షల సూట్ మాటేంటీ అంటూ కాంగ్రెస్ ఫైర్